స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు
వెదురుకుప్పం: చెరుకు తోటలో అక్రమంగా డంప్ చేసిన ఎర్రచందనం 11 దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల కథనం మేరకు.. మర్రిపల్లె గ్రామంలోని సుధాకర్ నాయుడికి చెందిన చెరుకుతోటలో ఎర్రచందనం దుంగలను డంప్ చేసినట్లు గ్రామస్తులు మంగళవారం ఉదయం వెదురుకుప్పం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికెళ్లి పరిశీలించారు. చెరుకు తోటలో దుంగలు ఉండడాన్ని గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు తెలిపారు.
అటవీశాఖ అధికారి శివన్న తన సిబ్బందితో మర్రిపల్లెకు చేరుకుని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్రైవేటు వాహనం ద్వారా కార్వేటినగరం››అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా గతంలో అనేక సార్లు ఇక్కడ నుంచి రాత్రిపూట ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఓ వ్యక్తి, పోలీసు అధికారులతో చేతులు కలిపి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారని విమర్శిస్తున్నారు. కాగా ఎర్ర చందనం దుంగలను ఎవరు డంప్ చేశారన్న విషయమై విచారణ చేపడుతున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ శివన్న పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment