
స్వాధీనం చేసుకున్న కార్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి టోకరా వేసి ఆయన ఖాతా నుంచి రూ.63 లక్షలు కాజేసిన నమ్మక ద్రోహి అతని డ్రైవరే అని తేలింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఫలితంగా 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకోగలిగారు. అతడి నుంచి రూ.7.15 లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి గురువారం తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన పి.వెంకట రమణ 2012లో అమీర్‌పేట్‌లోని దరమ్ కరమ్ రోడ్డులో నివసించే ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వద్ద డ్రైవర్/సహాయకుడిగా చేరాడు. తన భార్యతో కలిసి ఆయన ఇంటి ఆవరణలోనే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉండే వాడు. రిటైర్డ్ అధికారితో పాటు ఆయన భార్య సైతం వయోవృద్ధులు కావడం, వారి సంతానం విదేశాల్లో ఉండటంతో వారు ఎక్కువగా వెంకట రమణపై ఆధారపడేవారు. ఇతడూ పక్కాగా పని చేస్తుండటంతో పూర్తిగా నమ్మారు.
ఇతగాడు వీరి వద్ద పనితో పాటు క్యాబ్ డ్రైవర్‌గానూ పని చేసే వాడు. పలు పేర్లతో రుణాలు తీసుకుని మూడు కార్లు ఖరీదు చేసి క్యాబ్ సర్వీస్‌లుగా మార్చడంతో పాటు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అద్దెకు ఇచ్చాడు. వీటిలో ఓ వాహనం చోరీకి గురికావడం, మరోటి ప్రమాదానికి లోనుకావడంతో అప్పులకు వడ్డీలు చెల్లించడం కష్టంగా మారి అవి భారంగా మారాయి. దీంతో వక్రబుద్ధి పుట్టిన వెంకట రమణ తన యజమానికే టోకరా వేయాలని నిర్ణయించుకున్నాడు. రిటైర్డ్ అధికారితో పాటు అతని భార్య పేర్లపై బల్కంపేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయింట్ ఖాతా ఉంది. చాకచక్యంగా ఈ ఖాతా ఇంటర్‌నెట్ బ్యాకింగ్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌లను సంగ్రహించాడు. ఎస్సార్‌నగర్‌లో మనీట్రాన్స్‌ఫర్ వ్యాపారం చేసే ఓ మహిళ సహకారంతో, ఆమెకు కమీషన్ ఇస్తూ యజమాని ఖాతాను యాక్సస్ చేయించాడు. గత ఏడాది ఆగస్టు నుంచి విడతల వారీగా అందులో ఉన్న రూ.63 లక్షలు కాజేశాడు. ఈ డబ్బుతో రెండు కార్లు ఖరీదు చేసుకున్నాడు. గత నెలలో బ్యాంకునకు వెళ్లి తన ఖాతా లావాదేవీలను పరిశీలించగా, గడిచిన కొన్ని రోజులుగా ఆ ఖాతాలోని సొమ్ము మాయమవుతున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆయన సైబర్ క్రైమ్ అధికారుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్ డి.ప్రశాంత్, ఎస్సై జి.తిమ్మప్ప చాకచక్యంగా దర్యాప్తు చేశారు. నిందితుడు వెంకట రమణగా గుర్తించి గురువారం అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మిగిలిన వారి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment