బంధువులకు, స్నేహితులకు పెళ్లి పత్రికలు పంచి తిరుగుప్రయాణమైన వారిపై మృత్యువు పంజా విసిరింది. కొన్ని గంటల్లో ఇళ్లు చేరాల్సిన ఐదుగురి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. సూళగిరి సమీపంలో జాతీయరహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.
సాక్షి, చెన్నై(టీనగర్) : బంధువులకు, స్నేహితులకు పెళ్లి పత్రికలు పంచి తిరుగుప్రయాణమైన వారిపై మృత్యువు పంజా విసిరింది. కొన్ని గంటల్లో ఇళ్లు చేరాల్సిన ఆ ఐదుగురి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. సూళగిరి సమీపంలో జాతీయరహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన శంకర్ (50) బెంగళూరులోని లక్ష్మీనారాయణపుర ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇతని ఇంట్లో త్వరలో వివాహం జరగనుంది. బంధువులైన సుమతి(32), కుబేరన్(51), సుమతి(45),మణి(45), ఆనంద్‌లతో కలిసి చెన్నై, తిరుపత్తూరు తదితర ప్రాంతాలలోని బంధువులకు శుభలేఖలు పంచి సోమవారం రాత్రి కారులో బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు.
సూళగిరి సమీపంలోని అడ్డగురికి వద్ద బెంగళూరు నుంచి పాండిచ్చేరికి వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ డీలక్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలివైపు రోడ్డులోకి దూసుకెళ్లి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. అదే సమయంలో కారు వెనుక వస్తున్న ట్రక్‌అదే కారుపై దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుకాగా శంకర్, సుమతి, కుబేరన్, సుమతి, మణి మృత్యువాత పడ్డారు. వారి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కారులోని ఆనంద్‌కు, కేఎస్‌ఆర్‌టీసీ బస్సు డ్రైవర్ చిక్కణ్ణయ్య(50), కల్లకురిచ్చి జిల్లా, వేప్పేరికి చెందిన ట్రక్ డ్రైవర్ శివ గాయపడ్డారు. స్థానికులు స్పందించి ఆనంద్‌ను బెంగళూరుకు, మిగతా ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సూళగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కోసంహోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ కదిరవన్, çహోసూరు సబ్‌కలెక్టర్ చంద్రకళ, సూళగిరి తహసీల్దార్ పెరుమాళ్ మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
స్థానికుల ఆగ్రహం
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సూళగిరి నుంచి పేరండపల్లి వరకు జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, యూటర్న్‌లు, సొరంగమార్గాలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత రెండేళ్లలో జాతీయ రహదారి సూళగిరి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు ఇప్పటివరకు సుమారు 50 మంది మృతి చెందారని, రహదార్ల శాఖాధికార్లు పరిశీలనలు చేపట్టి సొరంగమార్గాలు, యూ–టర్న్‌లు, ఫైఓవర్లు నిర్మిస్తామని ఉత్తుత్తి హామీలు ఇచ్చారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment