నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న సీఐ చైతన్యకృష్ణ, ఇన్‌సెట్లో నిందితులు తీసుకెళ్లిన మారణాయుధాలు
తణుకు: ఒంటరిగా ఉన్న వృద్ధురాలి నుంచి బంగారాన్ని దోచుకోవాలని పన్నాగం పన్నారు.. అందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకుని ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశారు.. ఇందుకు మారణాయుధాలను సిద్ధం చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి చొరబడ్డారు. అయితే ప్లాన్ తిరగబడింది. అనుకోకుండా నిందితులంతా ఇంట్లో ఉండగానే వృద్ధురాలు గేటుకు తాళం వేసింది. అనూహ్యంగా పోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది. చివరికి నలుగురు నిందితులు కటకటాలు లెక్కిస్తున్నారు. తణుకు పట్టణంలో ఈనెల 28వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తణుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ వివరాలు వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులు ఆపై...
తణుకు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆంజనేయ కాంప్లెక్స్‌లో శ్రీనివాసా టీకార్నర్ నడుపుతున్న ఎన్ని శ్రీనివాసరావు అలియాస్ శ్రీను గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గతంలో కొండూరి వారి వీధిలో వృద్ధురాలు నాగులకొండ శాంతకృష్ణవేణి ఇంట్లో పై అంతస్తులో శ్రీనివాసరావు కుటుంబం అద్దెకు ఉండేవారు. ఇదిలా ఉంటే కృష్ణవేణి నలుగురు కుమారులు బంగారం వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు షాపులకు సంబంధించిన తాళాలు తల్లి ఇంట్లో ఉంచి ఉదయాన్నే తీసుకెళుతుంటారు. కృష్ణవేణి మాత్రం ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది.
అయితే ప్రతిరోజు బంగారు నగలు ఇంట్లో ఉంచుతున్నారని భ్రమ పడిన శ్రీనివాసరావు ఎలాగైనా బంగారాన్ని అపహరించుకుపోవాలని ప్రణాళిక చేశాడు. విజయవాడకు చెందిన తన మేనల్లుడు పిల్లా రామును సంప్రదించగా అతడి స్నేహితులు ఏలూరు ఖండ్రికగూడేనికి చెందిన దొండపాటి రాజు అలియాస్ చిన్నోడు, విజయవాడకు చెందిన ఇప్పిలి మురళితో కలిసి శ్రీనివాసరావు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందుకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తానని శ్రీనివాసరావు నమ్మబలికాడు. ఈనెల 28న పిల్లా రాము తణుకు రైల్వేస్టేషన్ వద్ద ఉండగా మిగిలిన ముగ్గురు మూడు కత్తులు, నైలాన్ తాళ్లు తీసుకుని కృష్ణవేణి ఇంటికి వెళ్లారు.
అడ్డం తిరిగిన కథ
కృష్ణవేణి ఇంటి çపరిసరాలు అణువణువూ తెలిసిన శ్రీనివాసరావు తనతో పాటు రాజు, మురళిలను తీసుకుని రాత్రి 9 గంటలకే ఇంటిపైకి చేరుకున్నాడు. కృష్ణవేణి కుమారులు ఇంటికి వచ్చి తిరిగి వెళ్లే వరకు వేచి చూసిన వీరు కిందికి దిగి కృష్ణవేణి గది తలుపులు కొట్టారు. అయితే కృష్ణవేణితో పాటు మనవరాలు భావన కూడా ఇంట్లోనే ఉంది. కృష్ణవేణి అప్పటికే బయట గేటు తాళం వేయడంతో అసలు మీరు లోపలకు ఎలా వచ్చారని భావన ప్రశ్నించింది. దీంతో అయోమయంలో పడిన నిందితులు తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కృష్ణవేణి తన కొడుకు నాగులకొండ బాలాజీకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు.
అదే సమయంలో వీరు పారిపోయేందుకు పై అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించారు. శ్రీనివాసరావు, మురళిలు తప్పించుకోగా రాజు స్థానికుల చేతికి చిక్కాడు. ఇతడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. దొండపాటి రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం చెప్పాడు. ఒకవేళ శ్రీనివాసరావును కృష్ణవేణి గుర్తుపడితే ఆమెను హత్య చేయడానికి సైతం తమతో పాటు కత్తులు, తాళ్లు తీసికెళ్లినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. నాగులకొండ బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ డీఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో సహకరించిన ఎస్సైలు కె.శ్రీనివాసరావు, పి.ప్రేమ్‌రాజు, క్రైం పార్టీ సిబ్బంది సత్యనారాయణ, అన్వర్, మహేష్, అక్బర్‌లాల్, వెలగేశ్వరరావులను జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment