సాక్షి, విజయవాడ: విజయవాడలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి జనం మీదికి దూసుకుపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ నంబరు ఏపీ 16జెడ్ 6604 సిటీ బస్సు వేగంగా దూసుకొచ్చి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై మాచవరం వెళుతున్న మైలవరానికి చెందిన తల్లీకూతుళ్ళు షేక్ ఖుర్షీద్ బేగం (30), హర్ష (9) అక్కడికక్కడే మృతి చెందగా నున్న చెరువు సెంటర్‌కు చెందిన వీరచందర్ (30 )ఆసుపత్రిలో మృతి చెందారు.
వరంగల్ నర్సంపేటకు చెందిన జి.నిహారిక, మైలవరానికి చెందిన అబ్దుల్ గఫార్, షేక్ కరీముల్లాకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్టీసీ బస్సు వెనుక నుంచి దూసుకురావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆర్టీసీ డ్రైవర్ బస్సు వదిలేసి పరారయ్యాడు. కళ్లెదుటే తమ వారు మృతి చెందడాన్ని చూసి కోపోద్రిక్తులైన బాధిత కుటుంబాలకు చెందిన వారు బస్సుకు నిప్పంటించారు.
పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పివేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ప్రమాదానికి బ్రేక్ ఫెయిల్ అయ్యిందా మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ క్రాంతి రాణా టాటా, ఏసీపీ నాయుడు, సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ నరేష్‌కుమార్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, కార్పొరేటర్ పిన్నంరాజు త్రిమూర్తిరాజు, సీపీఎం నాయకులు సీహెచ్ బాబూరావు, వైఎస్సార్ సీపీ నాయకులు సామంతపూడి చిన్నా, అమ్ముల రవికుమార్, తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment