సాక్షి, నల్గొండ : ప్రైవేటు పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం, డ్రైవర్ మద్యం మత్తు కారణంగా బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరు విద్యార్థులతో పాటు స్కూలు ఆయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలోని పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు సోమవారం సాయంత్రం 4 గంటలకు ముదిగొండ గ్రామం నుంచి చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి సుమారు 30 మంది విద్యార్థులతో బయల్దేరింది. మార్గమధ్యలో మల్లారెడ్డి గ్రామ సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న 1వ తరగతి చదువుతున్న జబ్బు సాయి, 3వ తరగతి చదువుతున్న చింతకుంట్ల విఘ్నేశ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ తరలించారు. బస్సులో ఉన్న మరో పది మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. బస్సు ఆయాకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మద్యం మత్తే ప్రమాదానికి కారణం
మండలంలోని మల్లారెడ్డిపల్లి సమీపంలో పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టిన సంఘటనకు బస్సు డ్రైవర్ మద్యం మత్తే ప్రధాన కారణమని తెలుస్తోంది. తాగిన మైకంలో బస్సు డ్రైవర్ పాఠశాల బస్సును ఇష్టానుసారంగా నడపడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. 30 మంది విద్యార్థులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడంతోపాటు పాఠశాల యాజమాన్యం నిబంధనలు పట్టించుకోకుండా గ్రామంలో ఆటో నడిపే ఓ యువకుడిని బస్సు డ్రైవర్‌గా నియమించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాగిన మైకంలో వాహనం నడుపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
తప్పిన పెను ప్రమాదం
పాఠశాల బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మిగతా విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాద సంఘటన తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైందోనని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
అదుపుతప్పి పాఠశాల బస్సు బోల్తా
Published Tue, Jun 18 2019 12:49 PM | Last Updated on Tue, Jun 18 2019 12:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment