
హైదరాబాద్: నగరంలో మరో బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. గాంధీ, నిలోఫర్ ఆసుపత్రుల నుంచి శిశువుల కిడ్నాప్ ఘటనలు మరువక ముందే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల ముసుగులో ఇద్దరు మహిళలు ఓ ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి ఉడాయించారు. సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా ఇద్దరు మహిళలు బాలుడిని తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
ఉపాధి కోసం నగరానికి...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సంజు, దిలీప్ భార్యాభర్తలు. ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి బండ్లగూడలో ఉంటున్నారు. వీరికి కుమారుడు ఆయుష్ (7), కూతురు (10) సంతానం. కొంతకాలం క్రితం దిలీప్ అనారోగ్యంతో మృతి చెందాడు. స్వీపింగ్ పని చేసుకుంటూ సంజు తన పిల్లలను పోషించుకుంటోంది. కాన్పూర్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చిన సంజూకు అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు పరిచయమయ్యారు.
టిఫిన్ కోసం వెళ్లొచ్చేసరికి...
సోమవారం ఆ మహిళలకు తన పిల్లలను అప్పగించిన సంజు టిఫిన్ కోసం స్టేషన్ బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళలు బిస్కెట్లు కొనిస్తామంటూ బాలుడిని బయటకు తీసుకువెళ్లారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడం, ఆయుష్ కనిపిం చకపోవడంతో సంజు రైల్వే పోలీసులను ఆశ్రయించింది. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీ సులు ఆ కిలాడీ లేడీలే బాలుడిని కిడ్నాప్ చేసినట్టు నిర్ధారించుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు బాలుడిని విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment