వాషింగ్టన్ : అగ్రరాజ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. వర్జీనియాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన వర్జీనియా బీచ్ ప్రభుత్వ భవనంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు. అయితే అతడి గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. గతంలో వర్జీనియా బీచ్‌లో పనిచేసిన ఉద్యోగే ఈ దారుణానికి ఒడిగట్టాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం గురించి మేగన్ బాంటన్ అనే ఉద్యోగిని మాట్లాడుతూ.. దుండగుడు ఒక్కసారిగా బిల్డింగ్‌లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడని పేర్కొన్నారు. తాము సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నామని... కాల్పుల శబ్దం విని వెంటనే లోపలికి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నామని తెలిపారు. తమ సహచర ఉద్యోగుల్లో కొంతమంది మాత్రం దుండగుడి తూటాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన మేయర్ బాబీ డేయర్.. వర్జీనియా బీచ్ చరిత్రలో ఇదొక విధ్వంసకరమైన రోజు అని విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment