మందుబాబులూ జర జాగ్రత్త! | Six driving licenses permanently canceled | Sakshi
Sakshi News home page

మందుబాబులూ జర జాగ్రత్త!

Published Sun, Mar 4 2018 12:59 AM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM

Six driving licenses permanently canceled - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్స్‌లో చిక్కిన మందుబాబుల్లో ఆరుగురి డ్రైవింగ్‌ లైసెన్సుల్ని న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేసింది. ఈ మేరకు ట్రాఫిక్‌ చీఫ్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ శనివారం వెల్లడించారు. గత నెల 26 నుంచి శుక్రవారం వరకు మొత్తం ఆరు రకాలైన ఉల్లంఘనలకు పాల్పడి చిక్కిన 655 మంది వాహనచోదకులపై ఎర్రమంజిల్‌లోని మెట్రోపాలిటన్‌ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయగా అందులో 195 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు ఆరుగురి డ్రైవింగ్‌ లైసెన్సుల్ని పూర్తిగా రద్దు చేయగా... నలుగురివి మూడేళ్ళు, పది మందివి రెండేళ్ళు, ఎనిమిది మందివి ఏడాది, ఇద్దరివి ఆరు నెలలు, 49 మందివి మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసింది.  

గరిష్టంగా 10 రోజులు..కనిష్టంగా ఒక రోజు 
మందుబాబుల్లో ఒకరికి 10 రోజులు, ఇద్దరికి ఆరు రోజులు, తొమ్మిది మందికి ఐదు రోజులు, పది మందికి నాలుగు రోజులు, 18 మందికి మూడు రోజులు, 69 మందికి రెండు రోజుల చొప్పున జైలు శిక్షలు పడ్డాయని రవీందర్‌ తెలిపారు. మైనర్‌ డ్రైవింగ్‌ కేసులో ఒకరికి నాలుగు రోజులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం నేరంపై 36 మందికి ఒకరోజు, నలుగురికి రెండు రోజులు, మైనర్‌కు వాహనం ఇవ్వడం నేరంపై (తండ్రి/యజమాని) తొమ్మిది మందికి ఒక రోజు, భారీ స్థాయిలో ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఒకరికి ఒక రోజు, ఇద్దరికి 2 రోజులు, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేస్తూ చిక్కిన 21 మందికి ఒక రోజు, 12 మందికి రెండు రోజులు జైలు శిక్ష పడింది. వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని, వీరికి పాస్‌పోర్ట్స్, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని ఆయన చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement