మృతి చెందిన రాజేంద్రప్రసాద్, కోమాలోకి వెళ్లిన భువన(ఫైల్)
అతివేగంగా బైకు నడిపిన యువకుడు అదుపుతప్పాడు. అదే రోడ్డులో భార్యతో కలిసి గుడికి వెళ్లి వస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బైకును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో రాజేంద్రప్రసాద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతిచెందగా... అతని భార్య భువన తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్లింది. మరోవైపు బైకును వేగంగా నడిపిన విజయ్ కూడా గాయాలతో కోమాలోకి వెళ్లాడు. ఈ విషాదకర సంఘటన బంజారాహిల్స్ పరిధిలోని ఇందిరానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది.
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని గ్రీన్‌బావర్చి హోటల్ నుంచి ఇందిరానగర్ బస్తీలోకి వెళ్లే రోడ్డుపై ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలై ఒకరు మృతి చెందగా ఇద్దరు కోమాలోకి వెళ్లారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు.. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గింజుపల్లి రాజేంద్రప్రసాద్(33) యాక్సెంచర్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ భార్య భువనతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్‌లో రెండేళ్ల నుంచి అద్దెకుంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో భార్యను తీసుకొని సమీపంలోని గుడికి బైక్‌పై వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఇందిరానగర్ వైపు నుంచి అతి వేగంతో బైక్‌పై దూసుకొచ్చిన విజయ్‌ముదిరాజ్ వీరి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో రాజేంద్రప్రసాద్ దంపతులు కుప్పకూలారు.
తల పగిలి రాజేంద్రప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన ఆయన భార్య భువన కోమాలోకి వెళ్లింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారకుడైన విజయ్‌కి కూడా తీవ్ర గాయాలు కాగా అతడు కూడా కోమాలోకి వెళ్లాడు. అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. విజయ్ ఇందిరానగర్‌కు చెందిన వాడు కాగా స్థానికులు ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోయారు. బంజా రాహిల్స్ ఎస్‌ఐ కె.ఉదయ్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై వివరాలు సేకరించారు.
బతికించని హెల్మెట్...
మృతుడు హెల్మెట్ ధరించినా ఉపయోగం లేకుండా పోయింది. వేగం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కిందపడ్డ రాజేంద్రప్రసాద్ తలపై నుంచి హెల్మెట్ ఎగిరి కొద్ది దూరంలో పడిపోయింది. దీంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఆయన తల వెనుకభాగం రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment