
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ డబ్బుల కోసం ఓ యువకుడు కన్న తండ్రిని అతి కిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో నివాసం ఉంటున్న కృష్ణ వాటర్ బోర్డ్‌లో పనిచేసి.. ఆరు నెలల క్రితం పదవి విరమణ పొందాడు. నెలవారి పెన్షన్ డబ్బులతో జీవనం సాగిస్తున్న కృష్ణతో అతడి కుమారుడు తరుణ్ తరుచు గొడవపడుతుండేవాడు. పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా తండ్రిపై ఒత్తిడి చేసేవాడు.
అయిన కృష్ణ డబ్బులు ఇవ్వకపోవడంతో.. తండ్రిపై పగ పెంచుకున్న తరుణ్.. అతనిపై ఇనుప రాడుతో దాడికి దిగాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ కృష్ణను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్టుగా తెలిపారు. దీంతో కృష్ణ మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు బంధువులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నారు.