ఏడో తరగతి నుంచే చోరీల బాట | Sports Bikes Robbery Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

ఏడో తరగతి నుంచే చోరీల బాట

Published Sat, Aug 3 2019 12:17 PM | Last Updated on Sat, Aug 3 2019 12:17 PM

Sports Bikes Robbery Gang Arrest in Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ నరసింహారెడ్డి, సీఐ శ్రీనివాస్, డీఐ యాదయ్య గౌడ్‌

లంగర్‌హౌస్‌: నేపాల్‌కు చెందిన రాంసింగ్‌ బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. అయితే అతని కుమారుడు  టమాల పవన్‌ సింగ్‌(20)కు స్పోర్ట్స్‌ బైక్‌లపై మోజు వాటిపై తిరిగేందుకు తన ఆర్థికస్థోమత సరిపోకపోవడంతో  ఏడో తరగతిలోనే చోరీలకు శ్రీకారం చుట్టాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు 17 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తన వైఖరి మార్చుకోకుండా రైళ్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి ఆభరణాలు దోచుకెళుతున్నాడు. సోదరుడితో కలిసి రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అతడిని లంగర్‌హౌస్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి 2 కెటిఎం బైక్‌లు, 3.5 తులాల బంగారు ఆభరణాలు, 750 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, డీఐ యాదయ్య గౌడ్‌లతో కలిసి ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ నరసింహారెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. నేపాల్‌కు చెందిన రాంసింగ్‌ కుటుంబం వెస్ట్‌ మారేడ్‌ పల్లిలో నివాసం ఉంటోంది.

అతని కుమారుడు టమాల పవన్‌ సింగ్‌(20)  పదోతరగతి వరకు చదువుకున్నాడు. స్పోర్ట్స్‌బైక్‌లపై మోజుతో  7 వ తరగతిలోనే చోరీలు మొదలు పెట్టాడు. తొలుత ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే అతను అనంతరం రైలు ప్రయాణికులను టార్గెట్‌ చేసుకుని ఆభరణాలు చోరీ చేసేవాడు. 2017లో 8 రైళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. కాగా గత నెల 13న కాకతీయనగర్‌కు సతీష్‌ బైక్‌ చోరికి గురైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు  ఆగస్టు 1న లంగర్‌హౌస్‌ అలంకార్‌ థియేటర్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న పవన్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయం వెలుగులోకి వచ్చింది. రైళ్లలో చోరీలు చేసి 17 సార్లు జైలుకు వెళ్లి వచ్చానని నిందితుడు విచారణలో వెల్లడించారు. కాకతీయనగర్‌లో కెటీఎం బైక్‌తో పాటు వరుసకు సోదరుడైన సంజయ్‌తో కలిసి మేడ్చల్‌లో మరో కేటీఎం బైక్‌ను దొంగిలించినట్లు తెలిపాడు. అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి 3.5 తులాల బంగారు నగలు, 750 గ్రాముల వెండి,, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

11 కేజీల గంజాయి స్వాధీనం
గంజాయి సరఫరా చేస్తున్న పాత నేరస్తుడి అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి నుంచి 11 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దూల్‌పేట్‌కు చెందిన చందన్‌ నవీన్‌ గంజాయి కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. శుక్రవారం ఉదయం మొఘల్‌నగర్‌ రింగ్‌రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న అతడిని అడ్డుకున్న లంగర్‌హౌస్‌ పోలీసులు తనిఖీలు చేయగా 11 కిలోల గంజాయి లభ్యమైంది. గత నెల 24న ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో సరఫరా చేస్తున్నట్లు  విచారణలో వెల్లడించాడు. గంజాయి స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement