ఆ తప్పటడుగే యువతి ప్రాణం తీసింది | Student Committed Suicide In Karnataka Due To Love Affair | Sakshi
Sakshi News home page

ప్రేమ వలలో చిక్కి యువతి బలి 

Published Sun, Feb 2 2020 8:37 AM | Last Updated on Sun, Feb 2 2020 8:45 AM

Student Committed Suicide In Karnataka Due To Love Affair - Sakshi

శివమొగ్గ : ప్రేమకు, ఆకర్షణకు వ్యత్యాసం తెలుసుకోలేక తెలిసీ తెలియని వయసులో వేసిన ఓ తప్పటడుగు యువతి జీవితాన్ని బలి తీసుకుంది. ప్రేమ పేరుతో ఇద్దరు యువకుల నయవంచన, వేధింపులు తాళలేక ఓ యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం శివమొగ్గ నగర శివార్లలో చోటు చేసుకుంది. నగర శివార్లలోని గొందిచట్నహళ్లి గ్రామానికి చెందిన సుప్రియ (19) నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ద్వితీయ పీయూసీ చదువుతుండేది. కొద్ది కాలం క్రితం అదే గ్రామానికి చెందిన సాగర్‌ అనే యువకుడితో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అయితే సుప్రియా కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండడంతో సుప్రియ ఆస్తిపై కన్నేసిన సాగర్‌ తనలోని కిరాతక ఆలోచనలకు పదునుపెట్టాడు.

ఈ క్రమంలో సుప్రియతో సన్నిహితంగా ఉన్న సమయంలో సుప్రియకు తెలియకుండా మొబైల్‌లో వీడియోలు, ఫోటోలు తీసుకున్నాడు. ఒకరోజు వీడియోలు, ఫోటోలు చూపించి తాను చెప్పినట్లు వినాలని లేదంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. అప్పటినుంచి తరచూ పెద్దమొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు బెదిరించి తీసుకునేవాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో సాగర్‌కు తీవ్రగాయాలు కావడంతో సుప్రియకు బెదిరింపుల పీడ వదిలింది. అంతటితో ఆగి ఉంటే బాగానే ఉండేది కానీ సుప్రియ చేసిన ఓ పొరపాటుతో సామాజిక మాధ్యమాల రూపంలో మరో ప్రమాదం ఆమె జీవితంలోకి ప్రవేశించింది.

సామాజిక మాధ్యమాల్లో చిత్రదుర్గ పట్టణానికి చెందిన సుబాని షరీఫ్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. తన పేరు సుబ్బు అని అబద్దం చెప్పి సుప్రియతో పరిచయం పెంచుకున్న షరీఫ్‌ అనంతరం ప్రేమ పేరుతో సుప్రియ జీవితంలోకి ప్రవేశించాడు. షరీఫ్‌ సైతం సుప్రియతో సాన్నిహిత్యంగా మెలిగిన సమయంలో మొబైల్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకొని బెదిరింపుల పర్వానికి దిగాడు. ఇలా షరీఫ్‌ సైతం లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. కొద్ది రోజులకు విషయం సుప్రియ తల్లితండ్రులకు తెలియడంతో షరీఫ్‌ అడిగినంత మొత్తాన్ని అతడి ఖాతాలో జమ చేశారు. అయినప్పటికీ మరింత డబ్బులు కావాలంటూ షరీఫ్‌ సుప్రియతో పాటు ఆమె తల్లితండ్రులను సైతం బెదిరించడం మొదలుపెట్టాడు.

నిందితుడు బెదిరింపులు తీవ్రతరం కావడంతో మనస్తాపం చెందిన సుప్రియ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా రెండో నిందితుడు షరీఫ్‌ శివమొగ్గ నగరంలో తచ్చాడుతూ సుప్రియ తల్లితండ్రుల కంటపడడంతో షరీఫ్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement