సాక్షి, నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ క్రైం: కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డితో తనకు పరిచయంగానీ, శత్రుత్వంగానీ ఏమీ లేదని హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్ చెప్పాడు. కేవలం అతని భార్య స్వాతి ప్రోత్సాహంతోనే తాను హత్య చేసినట్లు పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. సంచలనం సృష్టించిన సుధాకర్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజేశ్‌ను గురువారం నాగర్‌కర్నూల్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో స్వాతిని రెండు రోజుల క్రితం రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. రాజేశ్‌ను పోలీసులు రోజంతా విచారించారు. ఘటనాస్థలికి తీసుకెళ్లి పలు వివరాలు రాబట్టినట్లు సమాచారం.
పారిపోదామంటే..
స్వాతికి సుధాకర్ రెడ్డి అంటే ఇష్టం లేదని, ఆమె ఒత్తిడి, ప్రోద్బలంతోనే పథకం ప్రకారం అతడిని హతమార్చామని రాజేశ్ హైదరాబాద్‌లో మీడియా తో చెప్పాడు. పోలీసుల విచారణలో రాజేశ్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. మూడు నెలల క్రితం ఎక్కడికైనా పారిపోదామని స్వాతిని రాజేశ్ కోరగా పిల్లలు, తల్లిదండ్రులను వదిలి రాలేనని చెప్పింది. గత నెల 26న స్వాతి, రాజేశ్ కలసి తిరగడాన్ని సుధాకర్‌రెడ్డి చూశాక వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అదేరోజు రాత్రి సుధాకర్‌రెడ్డిని చంపాలని స్వాతి పథకం పన్నింది. దీంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ తప్పేలా చేసింది. 27న తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో తలపై రాడ్‌తో బాది హత్య చేశారు.
రాజేశ్‌ను డ్రైవర్‌గా ఇంటి యజమానికి స్వాతి పరిచయం చేసింది. తాము ఈ నేరం నుంచి ఎలా తప్పించుకోవాలన్న దానిపై చర్చించారు. సుధాకర్‌రెడ్డి స్థానంలో రాజేశ్ ఉండేలా స్వాతి ప్లాస్టిక్ సర్జరీ ఆలోచన చెప్పగా.. ముఖానికి కొన్ని రసాయనాలు పూసుకుని స్వాతి చున్నీపై పెట్రోల్ వేసుకుని రాజేశ్ ముఖాన్ని కాల్చుకున్నాడు. మరో కారు అద్దెకు తీసుకుని హైదరాబాద్ వెళ్లారు. అదే సమయంలో సుధాకర్‌రెడ్డిపై యాసిడ్ దాడి జరిగిందని స్వాతి బంధువులకు ఫోన్‌లో తెలిపింది. కాగా, హత్య కేసులో రాజేశ్ వాడిన రాడ్‌ను, మత్తు ఇంజక్షన్ల సిరంజీలను, రాజేశ్ తల వెంట్రుకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మత్తు ఇంజక్షన్ సరఫరా చేసినట్లుగా భావిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్‌ను శుక్రవారం రిమాండ్‌కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాతి.. ఖైదీ నంబర్ 687
మహబూబ్‌నగర్ క్రైం: నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి హత్య కేసులో నిందితురాలైన ఆయన భార్య స్వాతికి జైలులో అధికారులు 687 నంబర్ కేటాయించారు. 13 మంది ఖైదీలతో పాటు లాకప్‌లో ఆమెను ఉంచారు. జైలులో ఎలాంటి ఆందోళన లేకుండా గడిపినట్లు సమాచారం. ఉదయం పూట యోగా చేసిన స్వాతి.. అనంతరం జైలులోని నిరక్షరాస్యులకు అక్షరాలు దిద్దించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment