మిస్డ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. లవ్‌లో మునిగితేలారు.. చివరకు.. | - | Sakshi
Sakshi News home page

మిస్డ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. లవ్‌లో మునిగితేలారు.. చివరకు..

Published Wed, May 31 2023 8:00 AM | Last Updated on Wed, May 31 2023 8:23 AM

- - Sakshi

హైదరాబాద్: కలకలం రేపిన యువకుడు రాజేష్‌ మృతి కేసు కొలిక్కి వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కుంట్లూరులోని డాక్టర్స్‌ కాలనీ సమీపంలో సోమవారం కుళ్లిపోయిన స్థితిలో అల్లెవుల రాజేశ్‌ (24) మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల కీలక ఆధారాలు గుర్తించారు. మృతుడి సెల్‌ఫోన్‌ కాల్‌ డేటాలో చివరిసారిగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో మాట్లాడినట్లు ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతుడు రాజేష్‌కు, ఆమెకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఈమేరకు ఆమె భర్త, బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ములుగు జిల్లాకు చెందిన రాజేశ్‌కు ఆరు నెలల క్రితం సామాజిక మాధ్యమంలో హయత్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో పరిచయం ఏర్పడింది. సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు చూసి వివాహం కాలేదని భావించిన రాజేశ్‌.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ తరచూ కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి సంబంధం గురించి ఆమె భర్తకు తెలియడంతో మందలించాడు.

దీంతో ఆమెకు వివాహమై పిల్లలు ఉన్నారన్న విషయం రాజేశ్‌కు తెలియడంతో ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. మనస్తాపానికి గురైన ఆమె తాను చనిపోతానంటూ రాజేశ్‌తో వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టింది. కలిసి జీవితాంతం ఉండలేనప్పుడు కలిసి చనిపోదామని భావించిన టీచరు, రాజేశ్‌ ఇరువురూ.. మే 24న హయత్‌నగర్‌లోని ఓ ఫర్టిలైజర్‌ దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేశారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాల పరిశీలనలో పోలీసులు గుర్తించారు. అదే రోజు ఉపాధ్యాయురాలు ఆమె ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

ప్రియురాలి మరణ వార్త విని..
ఉపాధ్యాయురాలు చావు బతుకుల్లో ఆస్పత్రిలో ఉన్న విషయం తెలియక ఆమెకు రాజేశ్‌ వాట్సాప్‌ సందేశాలు, కాల్స్‌ చేశాడు. పదే పదే రాజేశ్‌ నుంచి ఫోన్లు రావటంతో ఆ ఫోన్‌ కుటుంబ సభ్యుల లిఫ్ట్‌ చేశారు. రాజేశ్‌ టీ షాపు దగ్గర ఉన్నానని చెప్పడంతో అక్కడికి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు రాజేశ్‌ను గట్టిగా మందలించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియురాలు మరణించిన విషయం రాజేశ్‌కు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురయ్యాడు.

తాను ఉండేది స్నేహితుడి గదితో కాబట్టి ఆత్మహత్య చేసుకోలేక.. శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్‌మెట్‌కు చేరుకున్నాడు. అదే రోజు (మే 24) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శివారు ప్రాంతం కావటంతో మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. 3–4 రోజులలో మృతదేహం కుళ్లిపోవటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రాజేశ్‌ మృతదేహానికి దుస్తులు లేకుండా ఉన్న స్థితిలో పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయురాలి మరణం అనంతరం ఆగ్రహంతో ఆమె కుటుంబ సభ్యులు రాజేశ్‌ మృతి చెందిన సంఘటన స్థలానికి వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో పోలీసులు తదుపరి విచారణ సాగిస్తున్నారు.

విషమిచ్చి నా భార్యను చంపేశారు
రాజేశ్‌ మృతి కేసుతో తనకెలాంటి సంబంధం లేదని టీచరు భర్త మీడియాకు తెలిపారు. అతడిపై దాడి చేశామన్న వార్తలలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తన భార్యకు, రాజేష్‌తో సామాజిక మాధ్యమాలలో పరిచయం ఏర్పడి ఉండొచ్చని, వాళ్లిద్దరికి వయసులోనూ చాలా తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. తన భార్యను ఎవరో బ్లాక్‌మెయిల్‌ చేసి భయపెట్టారని, ఎవరో విషం ఇచ్చి హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఆయన పోలీసులను కోరారు.

ఇదీ చదవండి: విడిపోయిన భార్యభర్తలను కలిపిన చిన్నారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement