విజయవాడలో మళ్లీ అరాచక శక్తులు పెచ్చరిల్లుతున్నాయి. సామాన్యులపై దాడులు, బలవంతపు వసూళ్లు, హత్యలు, కిడ్నాపులు, సెటిల్‌మెంట్లతో నగరం అట్టుడుకుతోంది. రౌడీలు, కేడీలు నిత్యం ఏదో ఒక అలజడి సృష్టిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కఠినచర్యలు చేపట్టాల్సిన పోలీసులు స్తబ్దుగా ఉంటున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకుల ఆదేశాలతోనే పోలీసులు చర్యలు చేపట్టలేకపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
సాక్షి, అమరావతి బ్యూరో : ముంబాయి, హైదరాబాద్ తరహాలో విజయవాడ నగరంలోనూ సుపారీ కల్చర్ విస్తరిస్తోంది. గతంలో వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా నగరంలో రౌడీయిజం ఉండేది. 2014 నుంచి రాజధానిలో రౌడీయిజం రూపు మార్చుకుంది. ఆస్తులు, డబ్బు కొల్లగొట్టడమే లక్ష్యంగా రౌడీయిజం చెలరేగిపోతోంది. టీడీపీ నేతలు పక్కా వ్యూహంతో రౌడీలను చేరదీస్తున్నారు. ‘సుపారీ’ పేరుతో డీల్ కుదుర్చుకుని దాడులు చేయిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం నగరాన్ని హడలెత్తించిన వర్గపోరు రౌడీయిజానికి భిన్నంగా ప్రస్తుతం రౌడీలు దందాలు సాగిస్తున్నారని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. సామన్యులు, వ్యాపారులు లక్ష్యంగా దాడులు, బెదిరింపులకు పాల్పడుతూ అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. అందుకోసం ఇతర ప్రాంతాల నుంచి రౌడీలను కూడా రప్పిస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
ఆ నలుగురి అండ...
నలుగురు టీడీపీ ప్రజాప్రతినిధులతోపాటు మధ్యస్థాయి నేతల అండతోనే విజయవాడలో రౌడీయిజం జడలు విప్పుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివాదాస్పదుడైన ఓ ప్రజాప్రతినిధి రౌడీయిజంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. దీంతో అరాచక శక్తులు వాణిజ్య ప్రాంతంలో సెటిల్‌మెంట్లు చేస్తూ వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రెండేళ్ల కాలంలో దాదాపు 50 వరకు దుకాణాలను బలవంతంగా ఖాళీ చేయించడం గమనార్హం. శివారుప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు పెద్ద గ్యాంగ్‌లనే నిర్వహిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో రియల్టర్లను బెదిరిస్తూ బహిరంగంగానే దందాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నగర పాలకు సంస్థకు చెందిన ప్రజాప్రతినిధి అండతో రౌడీలు సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెలరేగిపోతున్నారు. ఈ నలుగురి అండతోనే రౌడీలు విజృంభిస్తున్నారు. అందుకు కొన్ని తాజా తార్కాణాలు ఇవీ...
♦ కొన్ని నెలల క్రితం నగరంలో కొందరు వైద్యులు ఏకంగా ఓ వ్యాపారిని కిడ్నాప్ చేయించి మరీ దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ఆ కేసును నీరుగార్చేలా టీడీపీ ప్రజాప్రతినిధి కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి.
♦ ఓ మహిళా న్యాయవాది హత్యకు పొరుగు జిల్లా నుంచి రౌడీలతో సుపారీ కుదుర్చుకున్నారు.
♦ గుంటూరు జిల్లాకు చెందిన రౌడీతో ఒప్పందం కుదుర్చుకుని రామవరప్పాడులో ఓ మహిళను హత్య చేశారు.
♦ సింగనగర్, సత్యనారాయణపురంలో సామాన్యుల ఆస్తులే లక్ష్యంగా రౌడీ మూకలు చెలరేగిపోతున్నాయి. తాము చెప్పిన ధరకు ఆస్తులు అమ్ముకుని వెళ్లాలని బెదిరిస్తున్నాయి. దీనిపై తాజాగా సీఎం చంద్రబాబు పర్యటనలో మహిళలు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు కూడా.
♦ కొన్ని నెలల క్రితం ఖల్ నాయక్ అనే నగరబహిష్కృత రౌడీ షీటర్ ఒకర్ని హత్య చేశారు.
♦ టీడీపీ ప్రజాప్రతినిధి తమకు పోటీగా ఉన్న ఒక ట్రావెల్స్ ఆపరేటర్‌ను కొంతకాలం క్రితం రౌడీలతో బెదిరించడం వివాదాస్పదమైంది.
రౌడీలు బాబోయ్ రౌడీలు...
రాజధాని రౌడీషీటర్లు, కేడీలకు అడ్డాగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడాలేని రీతిలో విజయవాడలోనే అత్యధికంగా నలుగురు నగర బహిష్కృతులు, 274 మంది రౌడీషీటర్లు, 130 మంది కేడీలు, 70 మంది వరకు బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు ఉన్నారు. వారిపై పోలీసులకు ఎలాంటి నియంత్రణ లేకుండాపోయింది. వారు నియమితకాల వ్యవధిలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయడమే లేదు. రౌడీషీటర్ ఖల్ నాయక్ చేతిలో ఒకరి హత్యకు గురైన తరువాత కొన్ని రోజులు పోలీసులు కౌన్సెలింగ్ అంటూ హడావుడి చేశారు. అయితే అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో తరువాత ఆ విషయాన్నే వదిలేశారు. అధికారం అండతో రౌడీలు తమ దందా సాగిస్తున్నారు. తీవ్రమైన నేరస్తులను గరిష్టంగా ఆరునెలల పాటు నగరం నుంచి బహిష్కరిస్తారు. ఆరు నెలల తరువాత సమీక్షించి అవసరమైతే బహిష్కరణను పొడిగిస్తూ ఉంటారు. ఆ విధంగా విజయవాడకు చెందిన నలుగురు రౌడీషీటర్లు రెండేళ్లుగా బహిష్కరణలోనే ఉన్నారు. అయితే వారు నగరానికి రాకపోకలు సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment