నిందితున్ని పసిగడుతున్న పోలీసు జాగిలం
అనంతపురం సెంట్రల్: పోలీసు శాఖలో కలకలం సృష్టించిన ‘తుపాకీ బుల్లెట్స్’ మాయం కేసును ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు ఛేదించారు. పోలీసు జాగిలం నిందితున్ని పసిగట్టడడంతో స్వీపరే దొంగోడుగా గుర్తించారు. వివరాల్లోకి వెలితే... నగరంలోని ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయంలో ఆదివారం 15 రౌండ్ల రైఫిల్ బుల్లెట్స్ మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. ఏఆర్ కానిస్టేబుల్ సోమశేఖరనాయుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న స్వీపర్ (హోంగార్డు) పెన్నోబిలేసు తుపాకీ (రైఫిల్) నుంచి 15 రౌండ్ల బుల్లెట్స్ దొంగిలించాడు. ఎవరికీ అనుమానం రాకుండా స్వీపర్ తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. కానిస్టేబుల్ సోమశేఖరనాయుడు 303 రైఫిల్‌ను కార్యాలయంలో అప్పగించే సమయంలో తుపాకీ రౌండ్స్ పరిశీలించారు. 15 రౌండ్లు బుల్లెట్లు తక్కువ ఉండడంతో కార్యాలయం అంతా వెతికారు. విషయాన్ని ఏఆర్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టిన ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ అనుమానితులను గుర్తించారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులే కారణమా?
రైఫిల్ బుల్లెట్ల చోరీ వెనుక పలు కారణాలున్నట్లు తెలుస్తోంది. తాగుడుకు బానిసైన స్వీపర్ పెన్నోబిలేసును ఏఆర్ అధికారులు, సిబ్బంది చులకనగా మాట్లాడేవారని సమాచారం. ఘటనకు ముందు రోజు అందరి ఎదుట మందలించినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టడంతో 303 రైఫిల్ బుల్లెట్లు విక్రయించడం ద్వారా కొంత సొమ్ము చేసుకోవచ్చునని స్వీపర్ భావించి దొంగతనానికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలిందని పోలీసువర్గాలు వెల్లడించాయి.
నిందితున్ని గుర్తించిన జాగిలం
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఉదయం అనుమానితులను ఏఆర్ డీఎస్పీ సమక్షంలో టూటౌన్ సీఐ ఆరోహణరావు, ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డిలు విచారించారు. విచారణలో ఎవరూ ఒప్పుకోలేదు. చివరకు పోలీసుజాగిలాన్ని రప్పించి విచారించారు. జాగిలం నేరుగా బుల్లెట్లు చోరీ చేసిన స్వీపర్ పెన్నోబిలేసు వద్దకు వెళ్లింది. విషయం బయట పడడంతో స్వీపర్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఏఆర్ కార్యాలయ ఆవరణలో చెత్తకుప్పలో దాచిపెట్టిన బుల్లెట్లను అధికారులు అప్పగించాడు. స్వీపర్‌పై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తుపాకీ నిర్వహణలో బాధ్యతారాహిత్యం కింద కానిస్టేబుల్ సోమశేఖరనాయుడుపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment