ప్రతీకాత్మక చిత్రం
చండీగఢ్ : సినిమాలో మాత్రమే జరిగే కొన్ని సంఘటనలు నిజజీవితంలో కూడా జరుగుతుంటాయి. అలాంటి ఓ వింతైన సంఘటన హరియణా రాష్ట్రంలో జరిగింది. టీ అమ్ముకునే వ్యక్తిని విధి కోటీశ్వరున్ని చేసింది. డబ్బు కోసం అతన్ని కొంతమంది కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాపర్ల అతితెలివి వాళ‍్లను పోలీసులకు పట్టించింది. సినిమాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఛేజింగ్‌లు, తుపాకి బెదిరింపులు.. చివరకు పోలీసులు చాయ్‌వాలాను రక్షించి క్షేమంగా ఇంటికి పంపించేశారు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని మనేసర్‌కు చెందిన హర్‌పల్ సింగ్ అనే చాయ్‌వాలాకు అదృష్టం కలిసొచ్చింది. అతడికి ఉన్న స్థలాన్ని హర్యానా ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అతనికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిన సంగతి తెలిసిన ఇద్దరు వ్యక్తులు సింగ్‌ను వెంబడించి తుపాకితో చావబాది కిడ్నాప్ చేశారు.
అతన్ని ఢిల్లీకి తరలించి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలని భావించారు. కారులో సింగ్‌ను ఎక్కించుకొని ఢిల్లీకి బయలుదేరారు. అతని కాళ్లను తాడుతో కట్టేసి, గన్ను గురిపెట్టి ఏమన్నా చేస్తే చంపుతామని బెదిరించారు. ఇక్కడ కిడ్నాపర్లు చేసిన ఓ పని వారిని పోలీసులకు పట్టుబడేలా చేసింది. సింగ్ కళ్లకు గంతలు కట్టిన వారు అది బయటకు కనిపించకుండా ఉండటానికి సన్‌గ్లాసెస్ అతని కళ్లకు పెట్టారు. కారు ఢిల్లీ-గురుగావ్ సరిహద్దు దగ్గరకు రాగానే అక్కడున్న పోలీసులకు అర్థరాత్రి సన్‌గ్లాసెస్ పెట్టుకోవటం ఏంటని అనుమానం వచ్చింది. అంతే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. కిడ్నాపర్లను మనేసర్‌కు చెందిన జన్మహన్ సింగ్, వతన్ రామ్‌గా పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment