నార్నూర్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్‌కు ఫిర్యాదు చేస్తున్న విద్యార్థిని కుటుంబీకులు, ఆదివాసీ నాయకులు
నార్నూర్(ఆసిఫాబాద్): విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారితప్పాడు. పిల్లలను తన పిల్లల వలే చూసుకోవాల్సిన అతడు ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన నార్నూర్‌లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గిరిజన బాలిక పట్ల బయోసైన్స్ ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్ వారం రోజుల క్రితం అసభ్యకరంగా ప్రవర్తించాడు.
విషయం తెలియడంతో విజయ్‌కుమార్‌ను ప్రధానోపాధ్యాయుడు జాదవ్ విఠల్ ఐటీడీఏ డీడీకి సరెండర్ చేశాడు. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. వాట్సప్ ద్వారా విషయం బయటకు పొక్కడంతో కలెక్టర్ దివ్యదేవరాజన్ విచారణకు ఆదేశించారు. బుధవారం ఐసీడీఎస్ పీడీ మిల్కా పాఠశాలలో విచారణ జరిపారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆరా తీశారు. కాగా, బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బయోసైన్స్ ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేష్ తెలిపారు.
ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
ఉపాధ్యాయుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సుగుణ డిమాండ్ చేశారు. బుధవారం పాఠశాలను సందర్శించి జరిగిన సంఘటనపై నిజనిర్ధారణ చేశారు. సదరు ఉపాధ్యాయుడిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్‌కు ఫిర్యాదు చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కన్నిబాయి, భాగుబాయి, ఇంద్రబాయి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని బంధువుల ఆందోళన
విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. ఐసీడీఎస్ పీడీ విచారణ జరుపుతుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల లోపలికి ఎవరినీ రానివ్వలేదు. గేటుకు తాళం వేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు గేటు తాళం పగులగోట్టి లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. సీఐ హనోక్ విద్యార్థిని తల్లిదండ్రులను లోపలికి అనుమతించడంతో శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment