
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సంజువాన్‌లో జరిగిన ఉగ్రదాడి విషాదాన్ని మరువకముందే పాకిస్తాన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోమవారం ఉదయం శ్రీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా ఉగ్రవాదులు తోకముడిచారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా ఉగ్రవాదులు ఘటనాస్థలం నుంచి కొన్ని క్షణాల్లోనే పరారయ్యారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇద్దరు ఉగ్రవాదులు ఏకే 47లు, బ్యాగులతో సీఆర్‌పీఎఫ్ క్యాంపును సమీపించారని అధికారులు తెలిపారు. క్యాంపును వద్దకు రాగానే ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరపగా, వెంటనే భద్రతా బలగాలు
ఎదురుకాల్పులు జరపడంతో ఉగ్రవాదులు పరారయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పరారైన ఉగ్రమూకల కోసం సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాలిస్తోంది. మరోవైపు ఇటీవల సంజువాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు, ఇతర సంస్థల ఉగ్రవాదులు తరచుగా సైనిక దుస్తుల్లో భారత్‌లో ప్రవేశించి దాడులకు తెగబడుతున్నారు.