
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీనటి రోజా నివాసంలో చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దొంగలు అపహరించారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మణికొండ గ్రామపంచాయతీ పంచవటి కాలనీలో రోజా కుటుంబం నివసిస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆమె భర్త సెల్వమణి చెన్నైకి వెళ్లారు. ఏపీలోని తన నియోజకవర్గం నగరిలో సాగుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో రోజా ఉండిపోయారు.
ఆదివారం రాత్రి రోజా, సోమవారం ఉదయం సెల్వమణి తిరిగి ఇంటికి వచ్చారు. పండుగకు ఊరెళ్లి వచ్చిన పనిమనిషి ఆదివారం సాయంత్రం బీరువా, కప్‌బోర్డుల తాళాలు తీసి ఉండటాన్ని గమనించింది. దీంతో దొంగతనం విషయం వెలుగులోకి వచ్చింది. చిన్న, చిన్న వెండి వస్తువులు, ప్లేట్లు, లక్ష్మీదేవి దీపాలు, కప్పులు, పన్నీర్‌పుట్టి, మూడు చేతి గడియారాలు, బంగారు గొలుసు, నెక్లెస్, డైమండ్ కమ్మలు, డైమండ్ బిల్ల, బంగారు గాజులు కలిపి మొత్తం 14 తులాల బంగారం, 2 కిలోల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి.
ఈ నెల 12 నుంచి ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళంచెవుల సెట్టు చాలారోజుల నుంచి కనిపించడంలేదు. దానిని చేజిక్కించుకున్నవారే నేరుగా ఇంట్లోకి ప్రవేశించి ఆభరణాలను తస్కరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు రోజా దంపతులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తమ వద్ద పనిచేసి మానేసిన డ్రైవర్లు, పనివాళ్ల వివరాలను పోలీసులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment