సాక్షి, బనశంకరి : ఇళ‍్ల తాళాలు బద్దలుకొట్టి చోరీలకు పాల్పడుతున్న ఘరానాదొంగ కార్తీక్ అలియాస్ ఎస్కేప్ కార్తీక్‌ను శనివారం ఈశాన్యవిభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.30 లక్షల విలువ చేసే బంగారు అభరణాలతో పాటు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అదనపు పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు.
శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీమంత్‌కుమార్‌సింగ్ వివరాలను వెల్లడించారు. కళ్యాణ నగర ప్రకృతి లేఔట్‌కు చెందిన ఎస్కేప్ కార్తీక్(28) కొత్తనూరు, హసన్, మైసూరు తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడేవాడు. పోలీసులకు పట్టుబడిన కార్తీక్ నుంచి రూ.30 లక్షల విలువ చేసే ఒక కిలో బంగారు ఆభరణాలు, మూడు సెల్‌పోన్లు ను స్వాధీనం చేసుకున్నారు. హెణ్ణూరు కుమార్, జగన్ అనే ఇద్దరి తో కలిసి కార్తీక్ ఇళ్లులో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల‍్లడైంది.
కేవలం 6 తరగతితో చదువుకు స్వస్తిపలికిన కార్తీక్ 16 ఏళ్లు వయసులోనే చోరీలు చేయడం అలవాటు చేసుకున్నాడు. హెణ్ణూరులో ఓ ఇంటి కిటికీ బద్దలు కొట్టి లోనికి చొరబడిన కార్తీక్ రూ.10 లక్షల నగదు అపహరించుకెళ్లాడు. పెద్ద మొత్తంలో ఒకేసారి నగదు లబించడంతో చోరీలనే తన వృత్తిగా ఎంచుకున్నారు. సాయంత్రం సమయంలో తన అనుచరులతో కలిసి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లును గుర్తించి రాత్రి సమయంలో తాళం బద్దలు కొట్టి చోరీలకు పాల్పడేవారు.
చోరీ సొత్తును అట్టికాగోల్డ్, ముత్తూట్‌పైనాన్స్, ఇతర కుదువ దుకాణాల్లో కుదవపెట్టడం, బంగారుఆభరణాలు విక్రయించి విలాసవంతమైన జీవనం సాగించేవాడు. సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు 2007 లో కార్తీక్ ను అరెస్ట్ చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. జైలులో శిక్ష అనుభవిస్తూ ఖైదీలకు భోజనం సరఫరా చేయడానికి వచ్చిన కార్తీక్ ఇస్కాన్ సంస్ధ భోజనం అందించే వాహనంలో దాక్కుని పరారయ్యాడు. పరప్పన అగ్రహర పోలీసులు తీవ్రంగా గాలించి 45 రోజుల అనంతరం కార్తీక్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇతడికి ఎస్కేప్ కార్తీక్ గా పేరుపొందాడు. ఇప్పటివరకు ఇతడిపై నగరంతో పాటు వివిధ పోలీస్‌స్టేషన్లులో 70కి పైగా కేసులు నమోదు అయ్యాయని సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment