ఈత సరదా వారింట్లో పెను విషాదాన్ని నింపింది. బంధువుల ఇంటిలో జరిగిన శుభకార్యానికి వచ్చిన ముగ్గురు పిల్లలు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలో కవలలు మృతిచెందడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు.
గూడూరు(మహబూబాబాద్) : చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ గ్రామంలో మంగళవారం రాత్రి వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం... దామరవంచ గ్రామానికి చెందిన షేక్‌బాబాకు వరంగల్ రంగశాయిపేట శివారు నక్కలపల్లికి చెందిన షాహిద్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి షేక్ అజీజ్‌పాషా(12), షేక్ అజీజ్‌బాబా(12) కవల పిల్లలు ఉన్నారు. వీరి తండ్రి షేక్‌బాబా చనిపోయాడు.
దీంతో తల్లి ఇద్దరు కుమారులను తీసుకొని వరంగల్ సమీపంలోని నక్కలపల్లిలోని తల్లిగారింటి వద్ద ఉంటోంది. షాహిద్ చెల్లెలు షేక్ అంజత్, ఫాతిమా దంపతుల కుమారుడు షేక్ అమ్జద్ ఖాదర్(10) కలిసి మండలంలోని దామరవవంచలో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురు బాలురు శివారులోని చెరువులోకి ఈతకు వెళ్లారు. పిల్లలు కనిపించకపోవడంతో షాహిద్ బంధువులకు చెప్పింది.
రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో, అందరూ కలిసి వెతకడం ప్రారంభించారు. చివరకు చెరువు సమీపంలో చూడగా, ముందుగా ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న వారు వెళ్లి చెరువులో వెతకగా మరో బాలుడు మృతిచెంది కనిపించాడు. ముగ్గురి మృతదేహాలను ఇంటికి చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. శుభకార్యం జరిగిన ఇంటికి వచ్చిన బాలురు ముగ్గురు చనిపోయారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment