రోదిస్తున్న తల్లి, భార్య, వెంకట్ సోదరుడు, ఇన్‌సెట్లో వెంకట్ మృతదేహం
సాక్షి, చందంపేట (దేవరకొండ) : 18 ఏళ్లు నిండిన ఓ యువకుడు ప్రేమించుకుని వివాహం చేసుకున్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రి నుంచి విడిపోయాడు. తల్లి పని చేసి సాకింది. ఆ యువకుడు ప్రయోజకుడయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, కాళ్లపై నిలబడ్డ కొడుకు మృత్యువాతపడ్డాడు. స్నేహితులతో కలిసి వచ్చి మృత్యుఒడిలోకి వెళ్లాడు. రెండున్నరేళ్లలోపు ఇద్దరు కుమారులకు దూరమయ్యాడు. తల్లి, భార్య రోదనలు, ఆ చిన్నారులను చూస్తే పలువురిని కన్నీటి పర్యంతం చేసింది.. ఈ ఘటన ఆదివారం రాత్రి నేరెడుగొమ్ము మండలం కృష్ణా నది తీరమైన వైజాక్ కాలనీలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రాంతంలోని మెహిందీపట్నంకు చెందిన గడ్డం వెంకట్(23) హైదరాబాద్‌లోని సోని ట్రాన్స్‌పోర్ట్‌లో ఇన్‌చార్జ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అదే కాలనీకి చెందిన నిర్మలతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర సంవత్సరాల లోపు ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
తన కంపెనికి చెందిన ఏడుగురు మిత్రులతో కలిసి వెంకట్ ఆదివారం సుమారు 3 గంటల సమయంలో వైజాక్ కాలనీలోని ఓ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి అక్కడే తినేందుకు కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాన్ని సందర్శించేందుకు మిత్రులతో మర బోటులో వెళ్లాడు. అక్కడే కాసేపు ఆగినీటిలో ఈత కొట్టారు. ఇదే క్రమంలో మద్యం సేవించి వెంకట్ ప్రమాదవశాత్తు నీటి గుంతలోకి వెళ్లిపోయాడు. తోటి మిత్రులు అరుపులు వేయడంతో మత్స్యకారులు అక్కడికి వెళ్లి గాలించారు. పోలీసులకు కూడా సమాచారం అందడంతో కృష్ణా నదిలో పోలీసు సిబ్బంది జల్లడ పట్టడంతో సుమారు గంట సేపటికి వెంకట్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పచ్చిపాల పరమేశ్ తెలిపారు.
అడ్డూఅదుపు లేకుండా మద్యం విక్రయాలు
తెలంగాణ రాష్ట్రంలో అరకు పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందిన వైజాక్ కాలనీలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గతంలో పుష్కరాల సమయంలో వచ్చిన ఓ చిన్నారి కూడా మృత్యువాతపడగా మట్టి, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడడంతో మరో చిన్నారి మృతిచెందాడు. అనుమతి లేకుండా మర బోట్లలోవేలాది రూపాయలు వసూలు చేసి సాగర తీరంలో కొంత మంది వ్యాపారం చేస్తున్నారు. ప్రమాదం ఉన్నప్పటికి మరబోట్లేనే మద్యం, వంటకాల పేరుతో పర్యాటకుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తూ సరదాగ వచ్చిన వారి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోయేలా ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
నిద్రావస్థలో మత్స్యకార సంస్థ
అర్హత, రక్షణ జాకెట్లు, హెచ్చరికలు, సూచనలు ఇవ్వాల్సిన మత్స్య శాఖ నిద్రావస్థలో ఉంది. ఆదివారం రాత్రి జరిగిన ఘటనలో వెంకట్ మృతి చెందినప్పటికీ ఆ శాఖ సోమవారం నాటికి కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి పలు హెచ్చరికలు చేయాల్సి ఉంది. అనుమతి లేకుండా మరబోట్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఈ విషయమై నేరెడుగొమ్ము ఎస్‌ఐ పచ్చిపాల పరమేశ్‌ను వివరణ కోరగా నలుగురు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ, ఇద్దరు హోంగార్డులు ఉన్నారని, ఎన్నికల నిర్వాహణ, ఆయా గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలపై దృష్టి సారించామని, మత్స్య శాఖ, మండల పరిషత్, తహసీల్దార్ ఈ విషయాలపై దృష్టి సారించాలని, కాని వారు పట్టించుకోవడం లేదన్నారు.
కన్నీరు..మున్నీరు
వెంకట్, నిర్మలలు మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు.. అందరిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండున్నర సంవత్సరాల లోపు అభి, అఖి కుమారులు ఉన్నారు. చిన్నప్పటికి నుంచి తండ్రి తమ నుంచి దూరమైనా తల్లి ఆలనా..పాలన చూసి ప్రయోజకున్ని చేసింది. గత రెండు రోజుల క్రితం తాను సంపాదించిన డబ్బులలో ఓ ద్విచక్ర వాహనం కొనుక్కుంటానని తల్లిని కోరడంతో కొన్ని పైసలు ఇచ్చానని, రెండు రోజుల్లో బండి తెచ్చుకుంటానని చెప్పి వెళ్లిన కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లి రోదన అంతా ఇంత కాదు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఈ ప్రాంతంలో చనిపోవడం ఏంటని ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. నా వెంకట్...నాకు కావాలి ప్రేమించి వివాహం చేసుకున్న భార్య నిర్మల చిన్నారుల ఏడుపులతో కేకలు పెట్టడడం కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment