సాక్షి, యాదాద్రి: యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో పట్టపగలే దుండగలు ఓ ఇంట్లోకి చొరబడి చోరికి యత్నించారు. దీన్ని అడ్డుకున్న అశ్విని(16)కి గుళికలు తాగించి సొమ్ముతో పరారయ్యారు. ఆబాలికను కుటుంబసభ్యులు మైరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాలమాకులు మల్లయ్య, పద్మ దంపతులకు కుమార్తె అశ్వినితోపాటు కుమారుడు కిరణ్ ఉన్నారు. అశ్విని స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉంది. తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా తమ్ముడు మిత్రులతో ఆడుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నసమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు.
బీరువా, సూట్‌కేస్‌ను పగులగొట్టి చోరికి యత్నిస్తుండగా అశ్విని ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహం చెందిన వారు హత్యకు పన్నాగం పన్నారు. వరి పొలంలో చల్లేందుకు తీసుకువచ్చిన గుళికల మందు ప్యాకెట్‌ను ఇంట్లో గుర్తించారు. వెంటనే నీటిలో కలిపి బాలికకు తాగించారు. ఆ తర్వాత ఇంటి ముందు, వెనుక తలుపులకు బయటనుంచి గొళ్లెం వేసి వెళ్లిపోయారు. చాలా సేపటి నుంచి బాలిక కనిపించకపోవడంతో.. స్థానికులు ఇంటికి వచ్చి గమనించారు. లోపలి నుంచి అరుపులు వస్తుండడంతో గొల్లెం తీసి లోనికి వెళ్లగా కిందపడి కొట్టకుంటూ కన్పించింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించగా ఇంటికి వచ్చిన వారు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చౌటుప్పల్ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
ఈ ఘతుకానికి పాల్పడింది తెలిసిన వ్యక్తులేనని అశ్విని తల్లి పద్మ వాపోయింది. పొలానికి తెచ్చిన గుళికలు తమ బిడ్డ ప్రాణాలను బలిగొన్నాయా.. ఆమె రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. అశ్విని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దొంగలు గుళికలు ఎందుకు తాగించారన్న వాదనలు వస్తున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment