సాక్షి, హైదరాబాద్ : డేటా చోరి వ్యవహారంలో తప్పించుకు తిరుగుతున్న ఐట్రి గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు హైదరాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై తెలంగాణ పోలీసులు అక్రమ కేసులను పెట్టారని, వాటిని కొట్టేయాలని అశోక్ హైదరాబాద్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు.. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ షాక్ ఇచ్చింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఇక అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లోత్ర వాదనలు వాదనలు వినిపించారు. కేసు తెలంగాణ పరిధిలోకి రాదని, ఏపీకి బదిలీ చేయాలని కోరారు. అయితే సిద్దార్థ్ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీ భవించలేదు. మరోవైపు అశోక్‌కు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేమని అశోక్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వెంటనే అశోక్‌ను పోలీసుల నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ ఏపీ సిట్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అశోక్ 2, 3 రోజుల్లో బయటకు వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడమే ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు అచ్చం ఓటుకు కోట్లు కేసునే ఫాలో అవుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మత్తయ్య ఏపీకి పరారవడం, తరువాత విజయవాడకు వెళ్లి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అప్పుడు మత్తయ్యను ఏపీ పోలీసులు వెనకేసుకురాగా ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే జరుగుతోంది. ప్రస్తుతానికి ఏపీ పోలీసుల సంరక్షణలోనే అశోక్ ఉన్నట్లు సమాచారం. అశోక్ కూడా అచ్చం మత్తయ్య తరహాలోనే ఈ కేసులో తన పేరును అన్యాయంగా ఇరికించారంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment