సాక్షి, హైదరాబాద్ : తప్పుడు పత్రాలు సృష్టించారనే ఆరోపణలతో నోటీసులు అందుకున్న టీవీ9 సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తి శుక‍్రవారం సైబరాబాద్ పోలీస్ కార్యాలయానికి వచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. నిధుల మళ్లింపు, ఫోర్జరీ అంశాలపై మూర్తిని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో 12 హార్డ్ డిస్క్‌లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా రవిప్రకాశ్, నటుడు శివాజీ, మరికొందరు కలిసి సంతకాలు ఫోర్జరీ చేశారని, రవిప్రకాశ్, సీఎఫ్‌వో మూర్తి, ఇతరులు తప్పుడు పత్రాలు సృష్టించి నిధులు దారి మళ్లీంచారంటూ ఏబీసీఎల్‌ను టేకోవర్ చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే రవిప్రకాశ్, నటుడు శివాజీ, సీఎఫ్‌వో ఎంవీకేఎన్ మూర్తికి నోటీసులు జారీ చేశారు. అయితే రవి ప్రకాశ్, శివాజీ నేరుగా విచారణకు హాజరు అవుతారా? లేక వాళ్ల తరపున న్యాయవాది హాజరు అవుతారా అనే దానికి ఉత్కంఠ నెలకొంది.మరోవైపు ఈ కేసుకు సంబంధించి బంజారాహిల్స్ ఏసీపీ, సీఐలు ఇవాళ ఉదయం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment