
వేణు(ఫైల్)
కాచిగూడ : అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెప్పల్‌బజార్ ప్రాంతానికి చెందిన దుగ్గి కుమారుడు వేణు (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో పేపర్‌బాయ్‌గా పని చేస్తున్నాడు.
బుధవారం ఉదయం బర్కత్‌పుర భూమన్నలేన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తుకు వెళ్లి పేపర్ వేసిన అతను కిందకు దిగిచ్చిన అనంతరం మరో సారి పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కుని మృతి చెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు ఐదారు గంటలు శ్రమించి అతి కష్టంపై మృతదేహాన్ని బయటికి తీశారు.
పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించడంలో ఆలస్యం కావడంతో గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాచిగూడ ఎస్‌ఐ లక్ష్మయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.