
మదనపల్లె: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కృష్ణాపురంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కూలీకి రానందుకు ట్రాక్టర్ యజమాని డ్రైవర్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. అడ్డుకోబోయిన డ్రైవర్ బంధువును కూడా ట్రాక్టర్‌తో తొక్కించాడు. ఈ ఘటనలో డ్రైవర్ హరి ప్రసాద్‌తో పాటు ఆయనకు మద్ధతుగా వచ్చిన నాగభూషణం కూడా మరణించారు. ట్రాక్టర్ యజమాని చంద్రానాయక్ ఘటన జరిగిన వెంటనే పరారయ్యారు. అనారోగ్యంతో హరిప్రసాద్, ఆయన సోదరుడు నాగభూషణం కూలీకి వెళ్లనట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఘటన అనంతరం చంద్రా నాయక్ ఇంటిపై బాధితుల కుటుంబసభ్యులు దాడికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఇలాంటి గొడవలు ఊరిలో మంచిది కాదని వారించడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అనంతరం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి శవాలను తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.