సాక్షి, మదనపల్లె(చిత్తూరు జిల్లా): మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులైన తల్లిదండ్రులు చేసినవి క్షుద్ర పూజలు కాదు.. రుద్రపూజలని హైకోర్టు న్యాయవాది రజని తెలిపారు. బిడ్డ నాలుక కోసి తల్లి తినేసిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. నిందితుడు పురుషోత్తం నాయుడిని హైకోర్టు న్యాయవాది రజని మదనపల్లె సబ్‌జైలులో శనివారం కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వీరికి శిక్ష వేయడం కంటే.. ప్రేరేపించిన వ్యక్తులను శిక్షించాల్సిన అవసరముందన్నారు. ఆధ్యాత్మిక శక్తిలో క్షుద్రుడు, రుద్రుడు.. రెండు రకాలని పేర్కొన్నారు. వీరు చేసింది రుద్రపూజలని చెప్పారు. ఆడపిల్లలకు రక్షణ లేదని బలంగా నమ్మడం వల్లే పెద్దమ్మాయి అలేఖ్య ఆధ్యాత్మిక శక్తి తెచ్చుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిసిందని న్యాయవాది రజని చెప్పారు. చదవండి: (నేను మూడో కన్ను తెరిస్తే భస్మమే : పద్మజ)
అలేఖ్య భోపాల్‌లో ఉన్నప్పుడు స్పిర్చ్యువల్ పవర్ నేర్చుకున్నట్లు ఆమె తండ్రి చెప్పారన్నారు. చదువులో ఉన్నతస్థితి సాధించి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు నిరోధిస్తానని ఆమె చెప్పేదని తెలిసిందన్నారు. బిడ్డలను చంపేందుకు డంబెల్ ఉపయోగించారని పోలీసులు చెబుతున్నా.. తల్లిదండ్రులు మాత్రం దానిని శివుడి ఢమరుకంగా భావించి ఉంటారన్నారు. ‘నేనే శివుడ్ని..’ అనుకుంటూ డంబెల్‌ను ఢమరుకంగా భావించి తలపై కొడితే బిడ్డ తిరిగి వస్తుందనే భ్రమతో కొట్టి ఉంటారన్నారు. పిల్లలిద్దరూ చనిపోయారని తల్లిదండ్రులిద్దరూ ఇంకా భావించట్లేదని చెప్పారు. పూజ మధ్యలో పోలీసులు షూలతో వెళ్లి గదిని అపవిత్రం చేసి.. పిల్లల దేహాలను తీసుకెళ్లడం వల్లే వారు తిరిగి రాలేదనే భ్రమలో ఉన్నారన్నారు. జైలులో దూరంగా ఉంచి మాట్లాడించడం వల్ల.. పూర్తిస్థాయిలో విషయాలు తెలుసుకోలేకపోయానని చెప్పారు. చదవండి: (జంట హత్యల కేసు: అమ్మాయిల చెవిలోఊదిందెవరు?)
పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ రవిమనోహరాచారి
అక్కచెల్లెళ్లు అలేఖ్య, సాయిదివ్య హత్యలకు సంబంధించి తల్లిదండ్రులతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. ఇప్పటివరకు 10 మందిని విచారించినట్లు చెప్పారు. హత్య జరగడానికి ముందు వారింటికి ఎవరెవరు వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. భోపాల్‌లో అలేఖ్యకు ఓ ట్రస్టుతో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. చదవండి: (ఇంకా మూఢత్వంలోనే.. తానే శివుడు, అవంతికనంటూ)
Comments
Please login to add a commentAdd a comment