
తెల్లవారుజామున చల్లగాలి వీస్తుండడంతో బస్సు డ్రైవర్ కునుకు తీశాడు. అంతే బస్సు ఒక్కసారిగా పక్కకు దూసు కెళ్లి బోల్తా పడింది. డ్రైవర్, మరో ప్రయాణికుడు మృతిచెందారు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు మరోసారి తిరిగి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. దేవుడే రక్షించాడని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
సాక్షి, తిరుపతి: తిరుపతి –చంద్రగిరి 150 అడుగుల బైపాస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున తమిళనాడుకు చెందిన బస్సు బోల్తా పడింది. దీంతో ఇద్దరు మృతిచెందారు. ఎమ్మార్‌పల్లి సీఐ విజయకుమార్ కథనం మేరకు.. తమిళనాడు ఆర్టీసీ బస్సు 28 మంది ప్రయాణికులతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వేలూరు నుంచి తిరుపతికి బయలుదేరింది. 5.30 గంటల ప్రాంతంలో తిరుపతి రూరల్ పరిధిలోని పాతకాల్వ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో కునుకుతీయడంతో బస్సు పిట్టగోడ పక్క నుంచి పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటాచలపతి (48), ప్రయాణికుడు పెరుమాల్ సుందరరాజన్ (29) బస్సు కింద పడి మృతి చెందారు. సుందరరాజన్ తల్లి పెరుమాల్ సరోజ, కండక్టర్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ కనకరాజు, ఎమ్మార్‌పల్లి సీఐ విజయకుమార్, ఎస్‌ఐలు ఈశ్వరయ్య, తిమ్మయ్య సంఘటనా స్థలం చేరుకున్నారు. మిగతా ప్రయాణికులను వేరే బస్సు ఎక్కించి తరలించారు.
హుటాహుటిన క్రేన్‌ను తెప్పించి బస్సును తొలగించారు. మృతదేహాలను బయటకు తీసి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కొడుకు పెరుమాల్ సుందరరాజన్ కంటి ముందే మృతి చెందడంతో తల్లి సరోజ కన్నీరుమున్నీరయ్యారు. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.
బస్సు మరోసారి తిరిగి ఉంటే..
బస్సు కల్వర్టులో పడినా అదృష్టవశాత్తు పెనుప్రమాదం తప్పింది. బస్సుబోల్తా కొట్టిన ఐదు అడుగుల దూరంలోనే హైవే లైన్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. బస్సు మరోసారి పొర్లి ఉంటే పెద్దప్రమాదమే చోటు చేసుకునేది. దీనికి తోడు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి పెద్ద మొత్తంలో లీక్ అయింది. ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఉంటే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉండేదని పోలీసులు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తువల్లే ప్రమాదం జరిగినట్టు తెలిపారు. బస్సు బోల్తా కొట్టిన విషయాన్ని గ్రామప్రజలు గమనించినా మానవవత్వం మరచి రక్షించే ప్రయత్నం చేయలేదు. బస్సులోని వారే కొంతమంది బయటకు దిగి మరికొంత మందిని బయటకు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment