
పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు యువకులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలో, సమీప గ్రామాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు.
గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన దబ్బా శంకర్(21), మానుకోట సిద్దార్థ వీధికి చెందిన జగ్గుల శివయ్య(19) కొంతకాలంగా చెడు వ్యసనాలకు అలవాటుపడి చోరీల బాటపట్టారు. వీరు 2016 డిసెంబర్‌లో కోర్టు సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించి పోలీసులకు చిక్కి జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చారు. అయినా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో సీసీఎస్, టౌన్ పోలీసులు గురువారం విశ్వసనీయ సమాచారంతో మానుకోట వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న ఈ ఇద్దరు యువకులను చాకచక్యంగా పట్టుకున్నారు. వారిని విచారించగా ఇటీవల సంచలనం సృష్టించిన నారోజు సత్యమనోరమ బంగారు నగల షాపులో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు.
అలాగే మానుకోట టౌన్ పరిధిలో బస్టాండ్ రోడ్డులో ఓ రెడీమేడ్ షోరూం, సైకిల్ షాపులో, మయూరి జ్యూఝెలరీ షాపులో, కేసముద్రం మండల పరిధిలో ఓ దేవాలయంలోని హుండీలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు.
అలాగే రోడ్లపై నడిచి వెళ్తున్న వృద్ధుల దృష్టి మరల్చి దొంగతనాలు చేసినట్లు తెలిపారు. వారిని విచారించిన అనంతరం వారి వద్ద నుంచి 2 సైకిళ్లు, 6 జీన్స్‌ప్యాంట్లు, రెండు షర్ట్‌లు, 8 టీషర్టులు, రూ.23,500 నగదు, 15 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆంగోత్ నరేష్‌కుమార్, టౌన్, రూరల్, సీసీఎస్ సీఐలు తిరుమల్, లింగయ్య, శ్రీనివాసులు, టౌన్, ట్రాఫిక్ ఎస్సైలు రమేష్‌బాబు, అశోక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment