సాక్షి, సిటీబ్యూరో: నమానాగా పుత్తడిని చూపి... బేరసారాల తర్వాత ఇత్తడి అంటగట్టి అందినకాడికి దండుకోవడంలో సిద్ధహస్తులైన కర్ణాటకకు చెందిన కొర్చా గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. అతడి నేతృత్వంలోని ముఠా కుల్సుంపురకు చెందిన వ్యాపారికి రూ.8 లక్షల మేర టోకరా వేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేక మంది వీరి బారినపడి మోసపోయారన్నారు. జియాగూడ ప్రాంతానికి చెందిన వ్యాపారి పి.సాయికుమార్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 21న ఓ ఫోన్‌కాల్ వచ్చింది.
నా పేరు రమేష్ అని పరియచం చేసుకుని..
అవతలి నుంచి మాట్లాడిన వ్యక్తి తన పేరు రమేష్‌గా పరిచయం చేసుకున్నాడు. కర్ణాటకలోని షిమోగకు చెందిన తాను ఫ్ల్లవర్ డెకొరేషన్ వ్యాపారం చేస్తుంటానని చెప్పాడు. తమ గ్రామంలో ఓ వృద్ధరైతు పొలాన్ని తవ్వుతుండగా రెండు కేజీల బంగారు కణికెలు (పిల్లెట్స్) దొరికాయని నమ్మించాడు. మార్కెట్‌లో వీటి విలువ రూ. 50 లక్షల పైనే ఉంటుందని, అయితే అనారోగ్యానికి గురైన ఆ వృద్ధుడు వైద్యం చేయించుకునేందుకు ఖర్చుల కోసం ఆ బంగారాన్ని తక్కువ ధరకే విక్రయిస్తున్నాడంటూ ఎర వేశాడు. నమూనా కావాలంటే షిమోగ జిల్లాలోని అర్పనాల్లి గ్రామానికి రావాలని సూచించాడు. ఇతడి మాటలు నమ్మిన సాయికుమార్ అదే నెల 24న అక్కడకు వెళ్ళాడు.
పుత్తడి చూపి ఇత్తడి ఇచ్చారు..
అర్పనాల్లిలో అతడిని రమేష్‌గా చెప్పుకున్న శాంత కుమార్‌తో పాటు రైతుగా నటించిన వృద్దుడు కలిశారు. వీరు తమ వద్ద రెండు కిలోల బరువైన పిల్లెట్స్‌ను బంగారం వంటూ చూపించారు. పరీక్షించుకునేందుకు వేరుగా ఉంచిన నిజమైన నాలుగు బంగారు ముక్కలు సాయికుమార్‌కు ఇచ్చారు. వీటిని తీసుకుని హైదరాబాద్ వచ్చిన ఆయన పరీక్షించుకోగా మేలిమి బంగారంగా తేలింది. దీంతో ఆ రెండు కిలోలు కూడా బంగారానివేనని నమ్మిన సాయికుమార్ రమేష్‌ను సంప్రదించి మొత్తం ఖరీదు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే నెల 28న రూ.8 లక్షలు తీసుకుని అర్పనాల్లి వెళ్ళాడు. శాంతకుమార్ సహా మరో ఇద్దరికి డబ్బులు ఇచ్చిన బాధితుడు వారిచ్చిన ‘బంగారు పిల్లెట్స్’ తీసుకుని నగరానికి వచ్చి పరీక్షించగా... అవి ఇత్తడివిగా తేలింది.
దీంతో బాధితుడు కుల్సుంపురా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరానికే చెందిన మరో బాధితుడు వెంకటేశ్వరరావుకు నాలుగు కిలోల బంగారం ఎర వేసి మరికొంత దండుకున్నట్లు గుర్తించారు. కుల్సుంపుర, లంగర్‌హౌస్, ఎస్సార్‌నగర్, మలక్‌పేట ఠాణాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఈ మోసాలన్నీ షిమోగా కేంద్రంగా జరగడంతో ఒకే గ్యాంగ్ పనిగా గుర్తించిన సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. వాస్తవానికి నిందితుడు శాంత కుమార్ స్వస్థలం కర్ణాటకలోని దావనగిరి జిల్లా మసనికెరె అయినప్పటికీ... పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు షిమోగ కేంద్రంగా అక్కడి వారితో కలిసి మోసాలు చేశారు.
వీరు వినియోగించిన సిమ్‌కార్డులు సైతం తప్పుడు వివరాలతో సేకరించారు. సాంకేతికంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు నెలల క్రితం షిమోగా జిల్లాకు చెందిన ఉమేష్ నర్సింహప్ప, హెచ్‌సీ శరత్‌లను పట్టుకుని విచారించగా, శాంత కుమార్ ప్రధాన నిందితుడని, అతడికి రమేష్, రవి, శంతన్ అనే మారుపేర్లు ఉన్నట్లు వెల్లడించారు. దీంతో స్పెషల్ టీమ్ ఏసీపీ కె.నర్సింగ్‌రావు నేతృత్వంలోని బృందం గాలింపు చేపట్టి శాంత కుమార్ ఆచూకీ గుర్తించి అరెస్టు చేసింది. ఈ ముఠాల బారినపడిన వారిలో ఇంకా అనేక మంది ఉన్నప్పటికీ పరువు పోతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నట్లు భావిస్తున్నారు. ఇదే ముఠాకు చెందిన రంజప్ప అనే నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం శాంతకుమార్‌ను కుల్సుంపుర కేసులో అరెస్టు చేశారు. మిగిలిన కేసుల్లో ఆయా ఠాణాల అధికారులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment