వర్ష ఆస్పత్రిని సీజ్ చేయిస్తున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్
అనంతపురం న్యూసిటీ: నిబంధనలకు విరుద్ధంగా రక్తమా ర్పిడికి పాల్పడడంతో పాటు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్న వర్ష ఆస్పత్రిని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సోమవారం సీజ్ చేశారు. నగరంలోని వర్ష ఆస్పత్రిలో రక్తమార్పిడి (బ్లడ్ ట్రాన్స్‌మిషన్) చేస్తున్నట్లు సమాచారంతో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు సంధ్య, కేశవరెడ్డిలు ఆదివారం తనిఖీ చేసిన విషయం విదితమే. ఆస్పత్రిలో రక్తమార్పిడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ల్యాబ్ నిర్వహణ, శానిటేషన్ వైఫల్యం, ధరల పట్టిక పొందుపర్చకపోవడం, కేస్‌షీట్‌లో వైద్యుల సంతకాలు లేకపోవడం, రిజిస్ట్రేషన్‌లో పలు లోపాలు అధికారుల తనిఖీలో వెలుగుచూశాయి. ఈ కారణాల రీత్యా ఆస్పత్రిని మూసివేశారు. నగర చరిత్రలో ఆస్పత్రిని సీజ్ చేయడం ఇదే తొలిసారి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. బ్లడ్ బ్యాగ్స్‌లు ఎక్కడి నుంచి వచ్చాయోనని డ్రగ్ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. సదరు ఆస్పత్రి నిర్వాహకులపై డ్రగ్ అధికారులు కోర్టులో కేసు నమోదు చేసినట్లు తెల్సింది.
వేకువజాము వరకు విచారణ
వర్ష ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ సుప్రజ చౌదరి, ఆమె భర్త డాక్టర్ హర్షవర్ధన్ (అపెక్స్ రేడియాలజిస్టు)లను ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం వేకువజాము వరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు సంధ్య, కేశవరెడ్డిలు విచారణ చేశారు. ఆస్పత్రిలో చిల్లవారిపల్లికు చెందిన రాములమ్మ, బుక్కపట్నం చెన్నరాయుడుపల్లికి చెందిన అనితలకు ఎందుకు రక్తమార్పిడి చేశారని, ప్రభుత్వ మార్గదర్శకాలు మీకు తెలియవా అని ప్రశ్నించారు. డ్రగ్ యాక్ట్ ఉల్లంఘిస్తే ఆస్పత్రి సీజ్ చేయడమే కాక కెరియర్‌పై ప్రభావం చూపుతుందన్నారు. బ్లడ్ బ్యాగులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాల్సిందేనని అధికారులు గట్టిగా నిలదీశారు. ఓ ఏజెన్సీ నిర్వాహకుల ద్వారా బ్యాగులు తీసుకున్నట్లు వారు అంగీకరించారు.
సర్వజనాస్పత్రికి రోగుల తరలింపు..
వర్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులను డీఎంహెచ్‌ఓ 108 అంబులెన్స్‌లో సర్వజనాస్పత్రికి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రులను నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ వెంట డెమో ఉమాపతి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూపర్‌వైజర్ రమణ, సిబ్బంది గంగాధర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment