విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది | In Visakhapatnam Man Stabs Student For Rejecting Love | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది

Published Wed, Aug 28 2019 6:02 PM | Last Updated on Thu, Aug 29 2019 9:14 AM

In Visakhapatnam Man Stabs Student For Rejecting Love - Sakshi

సాయంత్రం.. సమయం.. 5 గంటలు.. కళాశాల విడిచిపెట్టారు.. మిగిలిన విద్యార్థులతోపాటు ఆ అమ్మాయి కళాశాల నుంచి బయటకు వచ్చి ఇంటివైపు అడుగులు వేస్తోంది. ఇంతలో హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువకుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. అంతే ఆ ఆమ్మాయి రోడ్డుపైనే కుప్పకూలింది. పట్టణ నడిబొడ్డున.. సినిమాహాలు, పెట్రోల్‌ బంక్, కళాశాల.. అన్నీ ఉన్న రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారి అలజడి రేగింది. అరుపులు, ఆర్తానాదాలతో దద్దిరిల్లింది. ఈ దారుణం ప్రశాంతతకు మారుపేరైన అనకాపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. 

సాక్షి, విశాఖపట్నం :  అనకాపల్లిలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న భీమునిగుమ్మానికి చెందిన కె.సాయి పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అదే ప్రాంతానికి చెందిన పి.యశోధభార్గవి పట్టణంలోని డీవీఎన్‌ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. భార్గవిని సాయి గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరిద్దరి విషయం పెద్దలకు తెలియడంతో రెండు కుటుంబాలకు చెందిన వారు పెద్దల సమక్షంలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. భార్గవి మైనర్‌ కావడంతో పెళ్లిని వాయిదా వేసినట్లుగా అక్కడివారు చెబుతున్నారు. ఈలోగా గత ఆరునెలలు నుంచి సాయి తాను ప్రేమించిన భార్గవితో ఘర్షణకు దిగేవాడని తెలిసింది. దీనికి ప్రధాన కారణం భార్గవి మరో వ్యక్తితో చనువుగా ఉండడమే.

ఇదే విషయమై ఆమెను తరచూ నిలదీసేవాడు. అయినప్పటికీ మూడో వ్యక్తితో ఆమె చనువుగా ఉండడాన్ని తట్టుకోలేని సాయి ఉన్మాదిగా మారాడు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కళాశాల నుంచి వస్తున్న భార్గవిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. కూరగాయల కోసే కత్తి పట్టుకొని భార్గవి మెడపైన, పక్కటెములకులపైన పొడవడంతో కుప్పకూలిపోయింది. ఈ సంఘటన స్వయంగా భార్గవి తాతకు సంబంధించిన పాన్‌షాపు ఎదురుగా జరగడంతో ఆయన షాక్‌కు గురయ్యాడు. సంఘటన జరిగిన కొద్ది క్షణాలకే అక్కడ గుమిగూడిన జనమంతా సాయిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ ఎస్సై చక్రధర్, స్వీటీ, సావిత్రి, ట్రాఫిక్‌ ఎస్సై స్వామినాయుడు సంఘటనా స్థలానికి వచ్చి ఘటన జరిగిన తీరును పరిశీలించారు.

అంతేకాకుండా భార్గవిపై సాయి దాడి చేసిన సమయంలో రెండు కుటుంబాలకు చెందిన కొందరు అదే దుకాణం వద్ద ఉండడం గమనార్హం. సాయిని అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఎస్సై చక్రధర్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును ప్రారంభించారు. భార్గవిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. ఈ దాడితో తీవ్రశోకంలోకి మునిగిపోయిన భార్గవి తల్లి నూకరత్నం కన్నీరుమున్నీరవుతూ పడిపోయింది. ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిర్ణయించామని, ముక్కపచ్చలారని తన కుమార్తెపై దాడి చేసిన సాయిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఒక్కసారిగా ఈ ఘటనతో అనకాపల్లి ప్రాంతం ఉలిక్కిపడింది.  

ఈ సమాచారం జిల్లా మొత్తం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రశాంతమైన అనకాపల్లి పట్టణంలో ఈతరహా సంఘటన ఎప్పుడూ చూడలేదని పురపెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. సాయి తండ్రి శ్రీను అనకాపల్లి శారదానదికి ఆనుకొని ఉన్న శ్మశానవాటిక కాపరిగా పని చేస్తున్నాడు. యశోధ భార్గవి తండ్రి కృష్ణ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి ఉమా నూకరత్నం గృహిణి. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరి మధ్య జరిగిన ప్రేమాయణం ఇంతటి విషాదఘటనకు దారితీయడం పట్ల భీమునిగుమ్మం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు మహిళా సంఘాలు ఈ ఘటనను ఖండిస్తూ సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన భార్గవికి ప్రథమచికిత్స చేసిన అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

నివేదిక కోరిన ఏయూ వీసీ
ఏయూ క్యాంపస్‌(విశాఖ తూర్పు): విద్యార్థినిపై అనకాపల్లిలో జరిగిన దాడి ఘటనపై ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నివేదిక కోరారు. డీవీఎన్‌ కళాశాల విద్యార్థినిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జరిగిన సంఘటనపై సత్వరమే తనకు నివేదిక అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. విద్యార్థినుల రక్షణకు, భద్రతకు ప్రాధాన్యమిస్తామన్నారు. త్వరలో వర్సిటీ అనుబంధ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి తగిన మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. మరోవైపు వీసీ ఆదేశాల మేరకు వర్సిటీ రెక్టార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ డీవీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రమేష్‌తో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కళాశాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో సంఘటన జరిగిందని, విద్యార్థిని ప్రాణాపాయం నుంచి బయటపడిందని ప్రిన్సిపాల్‌ తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్‌కు రిజిస్ట్రార్‌ సూచించారు.  

పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దుశ్చర్య?
ఒకే ప్రాంతం, ఒకే సామాజికవర్గానికి చెందిన సాయి, భార్గవిలకు పెద్దల సమక్షంలో పెళ్లి చేయాలని కొద్ది నెలలు క్రితం నిర్ణయించారు. నెల క్రితం సాయి సోదరికి వివాహం కూడా జరిగింది. అయితే భార్గవి అదే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తితో చనువుగా ఉంటుందని భావించి అనుమానంతో సాయి గాయాలపాలైన భార్గవిని నిలదీసేవాడు. ఇలా వీరిద్దరి మధ్య తరచూ వివాదం జరగడంతో నెలరోజుల క్రితం భార్గవి కుటుంబీకులు సాయి ఇంటికి వెళ్లి మీ అబ్బాయి మా అమ్మాయిని వేధిస్తున్నందున పెళ్లి వాయిదా వెద్దామని చెప్పినట్లుగా సమాచారం. దీంతో మరింత మానసిక ఉన్మాదానికి గురైన సాయి గత కొద్దిరోజుల నుంచి భార్గవితో వాదులాటకు దిగేవాడు. ఇక మానసికమైన ఉద్వేగానికి గురై ప్రేమోన్మాదిగా మారిన సాయి తట్టుకోలేక భార్గవిపై కత్తితో దాడి చేశాడు.

సాయిపై 307, 506, 509 సెక్షన్లు నమోదు 
యువతి భార్గవిపై హత్యాయత్నానికి పాల్పడిన సాయిపై 307, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై చక్రధరరావు పేర్కొన్నారు. 

కేజీహెచ్‌కు భార్గవి
భార్గవికి మెడపై, పక్కటెముకుల్లో కత్తిపోట్లు ఉన్నాయి. ఇక్కడ  ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాం. ప్రాణానికి ఎటువంటి హానీ లేదు. 
– జగన్మోహనరావు, ఎన్టీఆర్‌ వైద్యాలయం సూపరింటెండెంట్‌  

ఎంతటి వారైనా కఠిన చర్యలు
ప్రశాంతమైన అనకాపల్లి పట్టణంలో ఎప్పుడు ఇటువంటి దారుణ ఘటనలు జరగలేదు. ఈ హత్యాయత్నం కేసులో నిందితుడు ఎంతటివారైనా కఠిన శిక్ష తప్పదు. గాయపడిన బాలికకు తగిన వైద్య చికిత్స అందిస్తాం. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. 
–గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే

ఎంత ఘోరం చేశాడు
మా కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న సాయి ఇంత ఘోరానికి పాల్ప డతాడని అనుకోలేదు. వీరిద్దరికీ పెళ్లి చేద్దామని రెండు కుటుంబాలకు చెందిన  పెద్దల సమక్షంలో నిర్ణయించాం. ఇంతలోనే దాడికి తెగబడిన సాయిని కఠినంగా శిక్షించాలి.

సాయిపై 307, 506, 509 సెక్షన్లు నమోదు 
యువతి భార్గవిపై హత్యాయత్నానికి పాల్పడిన సాయిపై 307, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్సై చక్రధరరావు పేర్కొన్నారు. 

కేజీహెచ్‌కు భార్గవి
భార్గవికి మెడపై, పక్కటెముకుల్లో కత్తిపోట్లు ఉన్నాయి. ఇక్కడ  ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాం. ప్రాణానికి ఎటువంటి హానీ లేదు. 
– జగన్మోహనరావు, ఎన్టీఆర్‌ వైద్యాలయం సూపరింటెండెంట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement