సాక్షి, వరంగల్ : తన భార్య తలుగుల టీనా మృతికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అనిరోజ్ క్రిష్టియానా కారణమని మృతురాలి భర్త రవి ఆరోపించారు. శుక్రవారం కోర్టు ఎదుట టీనా మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించారు. జడ్జిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జులైవాడకు చెందిన టీనా న్యాయసేవాధికార సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. జడ్జి క్రిష్టియానా మానసిక వేధింపులు, సహచర ఉద్యోగుల ఎదుట అవమానిస్తుండటంతో కలత చెందిన టీనా.. గతేడాది సెప్టెంబర్ 26న న్యాయసేవా సదన్ భవనంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స అనంతరం తిరిగి విధుల్లో చేరింది. మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో అనేక ఆస్పత్రులు తిరిగినా ఫలితం దక్కలేదు. టీనా వైద్య ఖర్చులు నిమిత్తం ఇల్లును విక్రయించామని రవి సుబేదారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చివరకు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం టీనా తుదిశ్వాస విడిచింది.
కోర్టు ఎదుట బైఠాయింపు
కాగా, టీనా మృతదేహంతో కోర్టు గేటు ఎదుట కుటుంబసభ్యులు, బంధువులు, ఎమ్మార్పీఎస్ నేతలు బైఠాయించారు. మధ్యాహ్నం మొదలైన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. టీనా మృతికి కారణమైన జడ్జిని అరెస్టు చేయాలని, మృతురాలి కుటుంబానికి ఉద్యోగ అవకాశం కల్పించి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భర్త రవి, కుమారుడు సంజీవ్ ఒక దశలో జడ్జి చాంబర్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా ఉద్రిక్తత ఏర్పడింది. ప్రధాన జడ్జి తిరుమలాదేవి ప్రతినిధిగా సూపరింటెండెంట్ రవికాంత్ బాధితుల నుంచి వినతిపత్రాన్ని స్వీకరించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment