
కల్తీ పెట్రోలు గల పెట్రోలు బంక్
జయపురం : ఒక పక్క కేంద్రప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అదనపు భారం మోస్తున్న వినియోగ దారులు తాము పెట్రోల్ బంకులలో పోయించుకుంటున్న పెట్రోల్ కల్తీది అని తెలిస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించ నక్కరలేదు.
అటువంటి సంఘటన జయపురం పెట్రోల్ వినియోగదారులకు అనుభవ పూర్వకంగా తెలియవచ్చింది. జయపురంలోని మహారాణిపేటకు చెందిన కె.కోటేశ్వర రావు అనే వ్యక్తి జయపురంలోని మహాత్మాగాంధీ జంక్షన్‌లో గల ఒక పెట్రోల్ బంక్‌లో రూ.200 పెట్రోల్ తన స్కూటీలో పోయించి వెళ్లాడు.
ఆ వ్యక్తి కొంతదూరం వెళ్లేసరికి వాహనం ముందుకు కదిలేందుకు మొరాయించింది. ఎంత ప్రయత్నించినా స్కూటీ కదలక పోవడంతో మరో మార్గంలేక మెకానిక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. స్కూటీని పరీక్షించిన మెకానిక్ స్కూటీ పెట్రోల్ ట్యాంక్‌లో నీరు ఉందని అందుచేతనే కదలడం లేదని తెలిపాడు.
అదేమిటి ఇప్పడే కదా రెండు వందలు ఇచ్చి పెట్రోల్ పోయించింది. అది నీరుగా ఎలా మారిందని పెట్రోల్ బంక్‌కు వెళ్లి వాహన చోదకుడు అడిగాడు. అది విని అక్కడ ఉన్నవారు అనుమానించి ఒక బాటిల్‌లో పెట్రోల్ వేయించి చూడగా అందులో నీరు ఉన్నట్లు వెల్లడైంది.
ఆ బంక్‌లో పెట్రోల్ పోయించుకున్న వారు తమతమ వాహనాలను పరీక్షించగా వాటి ట్యాంక్‌లలో కూడా కల్తీ పెట్రోల్ బండారం బయటపడింది. ఈ విషయమై బాధితులు జయపురం జిల్లా పౌరసరఫరాల విభాగ అధికారులకు తెలియజేయగా ఆ విభాగ అధికారి రవినారాయణ నందో తన సిబ్బందితో వచ్చి పెట్రోల్‌ను పరీక్షించారు. పెట్రోల్‌లో నీరు కలిసి ఉందని వెల్లడి కావడంతో ఆ బంక్‌ను మూసి వేయించారు.
తనిఖీ చేయనున్న బీపీసీఎల్
పెట్రోలులోకి నీరు ఎలా వచ్చిందన్నది తమకు తెలియదని బంక్ యజమాని తెలపగా ఈ విషయం బీపీసీఎల్ అధికారులకు పౌరసరఫరాల విభాగ అధికారి తెలియ జేశారు.అక్కడి నుంచి ఇంజినీర్లు వచ్చిన తరువాత పెట్రోలులోకి నీరు ఎలా వచిందో కనుగొంటారని పౌరసరఫరాల అధికారి వెల్లడించారు.
భూమిలోగల పెట్రోల్ ట్యాంక్ లీక్ అయిందా లేక కల్తీ పెట్రోల్ వస్తోందా? లేదంటే బంకులోనే కల్తీ చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పెట్రోలులో నీరు కల్తీ జరగడం వల్ల తమ డబ్బు పోవడమే కాకుండా వాహనాలు పాడవుతాయని వినియోగ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.