
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరో ఇద్దరిని మాత్రం వదిలేశారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ కేసులో నివృత్తి కావాల్సిన మరికొన్ని అంశాలు ఇంకా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ ఇద్దరు ఎవరు?: ప్రణయ్ హత్యకు జరిగిన ప్రణాళిక క్రమాన్ని పోలీసులు పూర్తి వివరాలతో బయట పెట్టారు.పక్కా ప్రణాళికతో ప్రణయ్, అమృతల కదలికలపై కన్నేసిన నిందితులు బ్యూటీ పార్లర్‌కు వచ్చిన అమృతను కిడ్నాప్ చేసి తీసుకుపోవాలని ప్లాన్ చేసుకున్నారని, ఆమె వెంట ప్రణయ్ వస్తాడు కాబట్టి అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారని నిందితులు విచారణలో చెప్పిన విషయాలను మీడియాకు వివరించారు. అయితే బ్యూటీ పార్లర్‌కు ప్రణయ్‌తోపాటు ఆతని సోదరుడు కూడా రావడం, ఇద్దరిలో ప్రణయ్ ఎవరో తేల్చుకోలేక వెనక్కి తగ్గారని, అలా ఆ రోజు ఆపరేషన్ విఫలమైందని పోలీసులు ప్రకటించారు. అసలు బ్యూటీ పార్లర్ దగ్గర అమృతను కిడ్నాప్ చేసే పనిని మాత్రమే తనకు అప్ప జెప్పారని, హత్య కోసం వేరే ఇద్దరు యువకులను తీసుకువచ్చారని ప్రధాన నిందితుడు (ఏ–2) సుభాష్ శర్మ పోలీసుల విచారణలో బయట పెట్టాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్‌నుంచి తీసుకువచ్చిన ఆ యువకులు మద్యం సేవించడంతో, వారు అనుకున్న రీతిలో పనిచేయలేరని వారిని అస్గర్ అలీ ఈ పనినుంచి తప్పించాడని పోలీసులే ప్రకటించారు. అరెస్టు చేసిన నిందితుల్లో వారు లేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు, బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ, అస్గర్ అలీ, మహ్మద్ అబ్దుల్ బారీ, ఎండీ కరీం, తిరునగరు శ్రవణ్, సముద్రాల శివను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆ ఇద్దరు నిందితుల అరెస్టు చూపించలేదా? లేక అసలు నిందితులను పోలీసులు పట్టుకోలేక పోయారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విదేశాలకు వెళ్లేందుకు అస్గర్ ప్రయత్నాలు
ఈ హత్యకు కొద్ది రోజుల ముందే మాజీ ఉగ్రవాది అస్గర్ అలీ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడని సమాచారం. ఇందుకోసం పాస్‌పోర్టు తీసుకోవడానికి ప్రయత్నం చేయగా అది బెడిసి కొట్టిందని తెలుస్తోంది. సాధారణ జీవితం గడుపుతున్నట్లు నమ్మించిన అస్గర్ అలీ తనకు పరిచయం ఉన్న నాయకుల ద్వారా పాస్‌పోర్టుకోసం ప్రయత్నించాడని, కానీ, ఎస్పీ ససేమిరా అనడంతో ఆ ప్రయత్నాలకు చెక్ పడిందని అంటున్నారు.
నిఘా ఏదీ?: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో లింకులు.., కలసి పనిచేసిన అనుభవం ఉన్న మాజీ ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు పెద్దగా దృష్టి పెట్టలేదన్న విమర్శలు లేకపోలేదు. జిల్లా పోలీసు అధికారికి కళ్లు..చెవులుగా పనిచేయాల్సిన స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) పోలీసులు ఇవేవీ పట్టించుకోకపోవడం, కనీసం వారి కదలికలు, ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టకపోవడంతో వారు యథేచ్ఛగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment