సాక్షి, హైదరాబాద్: భర్తతో చనువుగా ఉంటోందనే కోపంతో మహిళపై భార్య వేడి నీళ్లు పోయండంతో నాలుగు రోజుల పాటు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజు, రహమత్‌లు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఉప్పర్‌పల్లి సత్సంగ్ విహార్‌కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే ఉండే మహారాష్ట్రకు చెందిన చంద్రిక(25) రాజు వద్దే పనిచేస్తోంది.
కొద్దిరోజుల క్రితం రహమత్ పుట్టింటికి వెళ్లడంతో రాజు, చంద్రిక మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పుట్టింటి నుంచి తిరిగొచ్చిన రహమత్.. చంద్రిక తన భర్తతో చనువుగా ఉండటం చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఈ నెల 7న రాత్రి చంద్రికను మాట్లాడదామని ఇంట్లోకి పిలిచిన రహమత్ బాగా కాగిన వేడి నీళ్లను పోసింది. దీంతో చంద్రిక వీపు, ముఖం బాగా కాలడంతో ఆమెను రాజేంద్రనగర్ పోలీసులు స్థానికుల సహాయంతో ఉస్మానియాకు తరలించారు. ఆ రోజు నుంచి చికిత్స పొందుతున్న చంద్రిక శనివారం మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment