వివరాలు వెల్లడిస్తున్న సీఐ రవికుమార్
కమలాపూర్(హుజూరాబాద్): అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని బాలికను సవతి తల్లే హత్య చేసిన సంఘటన కమలాపూర్ మండలం గూడూరులో జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో పిల్లల కావేరి(16) హత్య కేసులో సవతి తల్లి పిల్లల హారిక(28), గూడూరుకు చెందిన పాక ఐలుమల్లమ్మ (65)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎల్కతుర్తి సీఐ టి.రవికుమార్ వెల్లడించారు. గూడూరుకు చెందిన పిల్లల కరుణాకర్, శ్రీదేవి పదిహేడేళ్ల క్రితం ప్రేమ వివా హం చేసుకోగా వీరికి ఇద్దరు కూతుర్లు కావేరి, దీపిక ఉన్నారు.
2009లో శ్రీదేవి మృతిచెందగా తనకున్న ఆస్తిని కరుణాకర్ ఇద్దరు కూతుర్ల పేరుపై రాశాడు. ఆ తర్వాత 2011లో కరుణాకర్ హారికను రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఒక బాబు జన్మించాడు. అప్పట్నుంచి హారిక కావేరిని వేధింపులకు గురి చేస్తుండగా పలుమార్లు పంచాయతీలు జరిగాయి. ఈ క్రమంలోనే కరుణాకర్ ఈ నెల 2న శబరిమలైకి వెళ్లాడు. అదే రోజు హారిక గూడూరుకు చెందిన ఒకరితో, ఈ నెల 5న మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతుండగా కావేరి చూసింది. ఈ విషయాన్ని నాన్న రాగానే చెప్తానంది. అప్పటికే ఆస్తిపై కన్నేసిన హారిక ఇటు ఆస్తి కోసం, అటు వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని భావించి కావేరి హత్యకు పాక ఐలుమల్లమ్మతో కలిసి ప్రణాళిక రచించింది. ఈ నెల 5న రాత్రి కావేరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఐలుమల్లమ్మ కావేరి కాళ్లు పట్టుకోగా హారిక కావేరి మెడకు చున్నీ చుట్టి హతమార్చింది. కావేరి చనిపోయిందని నిర్ధారించుకుని ఆ మరునాడు ఉదయమే లేచి తన భర్త కరుణాకర్ శబరిమల నుంచి ఇంటికి వస్తున్నాడనే సాకుతో ఇళ్లంతా కడిగి శుభ్రం చేసింది.
ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న కావేరి రాత్రి పడుకుని తెల్లారేసరికి చనిపోయిందని ప్రచారం చేసింది. విషయం కావేరి అమ్మమ్మకు తెలిసి అక్కడకు చేరుకుంది. కావేరి మెడకు కుడివైపు, ముందు వైపున కమిలిన గాయాలున్నాయని, కరుణాకర్ ఇంట్లో లేని సమయంలో సవతి తల్లి హారికనే చంపి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ కావేరి అమ్మమ్మ భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా కేసు పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత కావేరిని గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐలుమల్లమ్మ సాయంతో సవతి తల్లి హారిక హత్య చేసిందని నిర్ధారణకొచ్చారు. నిందితుల కోసం వెతుకుతున్న క్రమంలో కమలాపూర్‌లో నివాసం ఉంటున్న గూడూరు సర్పంచ్ భర్త సాంబయ్య ఇంట్లో హారిక, ఐలుమల్లమ్మ ఉన్నారన్న సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కావేరిని హత్య చేసింది తామేనని హారిక, ఐలుమల్లమ్మ అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈ సమావేశంలో ఎస్సైలు నాగబాబు, సందీప్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment