ప్రేమిస్తావా అని చంపేసింది | mother kills his daughter | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తావా అని చంపేసింది

Published Wed, Jun 7 2017 10:10 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

ప్రేమిస్తావా అని చంపేసింది - Sakshi

ప్రేమిస్తావా అని చంపేసింది

-కోలారు జిల్లాలో కూతురిని కొట్టిచంపిన తల్లి

కోలారు : నవమాసాలు మోసి. పెంచి పోషించిన తల్లి కసాయిగా మారింది. కుమార్తె ప్రేమను జీర్ణించుకోలేక కన్నపేగును సొంతచేతులతోనే తెంచి వేసి మాతృత్వానికి మాయని మచ్చ తెచ్చింది. ఈ ఘటన  సోమవారం రాత్రి కర్ణాటకలో కోలారు జిల్లాకేంద్రం సమీపంలోని చిన్నాపుర గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన వెంకటమ్మకు భర్త చనిపోయాడు. కుమార్తె రాజేశ్వరి (18) కోలారులోని న్యూ గవర్నమెంట్‌  జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చేర్పించింది. రాజేశ్వరి చిన్నాపురకే చెందిన యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న వెంకటమ్మ.. ఇటువంటివి మన ఇంటావంట లేవని, ప్రేమాగీమా అనకుండా బుద్ధిగా చదువుకోవాలని కుమార్తెకు హితవు చెప్పింది. అయినప్పటికీ రాజేశ్వరి ధోరణిలో మార్పురాలేదు. ఇదే సమయంలో పీయూసీలో రాజేశ్వరి ఫెయిల్‌ అయింది. ప్రేమ వ్యవహారం వల్లే ఇలా అయ్యిందని తల్లి గొడవ పడేది. సోమవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు.

తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటమ్మ.. రాజేశ్వరి తలపై దుడ్డకర్రతో బలంగా బాదడంతో తీవ్ర గాయాలతో రాజేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. రాత్రి ఇంట్లో శవం ఉంచుకునే ఏమీ జరగనట్లు నిద్రపోయిందా తల్లి. మంగళవారం ఉదయం తన కూతురు చనిపోయిందంటూ కేకలు వేస్తూ హడావుడి చేసింది. అంత్యక్రియలకు పూనుకుంది. అనుమానంతో గ్రామస్తులు కోలారు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోలారు రూరల్‌ సీఐ పుట్ట ఓబళరెడ్డి, ఎస్‌ఐ శివరాజు వచ్చి వెంకటమ్మను అదుపులోకి తీసుకుని రాజేశ్వరి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఎస్‌ఎన్‌ఆర్‌ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో కూతురినే తానే కొట్టి చంపినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement