
సాక్షి, మదనపల్లె : చిత్తూరు జిల్లా మదనపల్లెలో పట్టపగలే ఓ మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా బుధవారం కలకలం రేపింది. మహిళా న్యాయవాది నాగజ్యోతిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. సుమారు 11 కత్తిపోట్లుకు గురైన ఆమె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
వివరాల్లోకి వెళితే.. మదనపల్లెలో ప్రముఖ న్యాయవాది జితేంద్రకు, ఆయన భార్య నాగజ్యోతికి కొంతకాలం నుంచి మనస్పర్థలు ఉన్నాయి. దీంతో ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నాగజ్యోతి స్కూటీపై ఎస్‌బీఐ కాలనీ నుంచి ప్రశాంత్ నగర్‌కు వస్తుండగా ఒక్కసారిగా దుండగులు కత్తులతో దాడి చేయడంతో, తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మరణించారు. అయితే భార్యాభర్తల మధ్య వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.