సాక్షి, చెన్నై: వావి వరుసలు మరచిన ఓ యువకుడు, కుటుంబ గౌరవానికి, బంధాలకు కలంకం తెచ్చే రీతిలో కిరాతకుడయ్యాడు. వరుసకు చిన్నాన్న కుమార్తెను ప్రేమించాడు. తనకు దక్కని ఆ అమ్మాయి మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ప్రేమోన్మాదిగా మారాడు. బుధవారం నిశ్చితార్ధానికి సిద్ధం అవుతున్న ఆ యువతిని మంగళవారం రాత్రి దారుణంగా కడతేర్చాడు. ఈ సంఘటన తిరుచ్చిలోని కీరమంగళంలో కలకలంలో చోటుచేసుకుంది.
రాష్ట్రంలో ఇటీవల కాలంగా వన్‌సైడ్ ప్రేమకు బలి అవుతున్న యువతుల సంఖ్య పెరుగుతోంది. ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆగ్రహంతో ఉన్మాదులుగా మారుతున్నారు. అయితే చెల్లెలు వరుస అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తూ, చివరకు ఆమెను హతమార్చడం తిరుచ్చిలోని కీరమంగళంలో కలకలం రేపింది.
వన్‌సైడ్ లవ్..
తిరుచ్చి నెం.1 టోల్ గేట్ సమీపంలోని కీరమంగలంకు చెందిన శివ సుబ్రమణ్యన్‌కు హేమలత(27) కుమార్తె ఉంది. పట్టభద్రురాలైన హేమలత తిల్లె నగర్‌లోని ఓ మొబైల్ నెట్ వర్కింగ్ సంస్థలో పనిచేస్తుంది. శివ సుబ్రమణ్యన్‌కు వరుసకు అన్న అయిన జ్ఞాన సంబంధం కుమారుడు సత్యకుమార్(30) ప్రతిరోజూ హేమలతను తన బైక్‌లో ఆ సంస్థ వద్ద డ్రాప్ చేసి, ఇంటికి తీసుకొస్తుంటాడు. వారి కుటుంబాల మధ్య హఠాత్తుగా విభేదాలు తలెత్తాయి. పక్క పక్క ఇళ్లలో ఉన్నా, మాటలు, రాకపోకలు కరువయ్యాయి. ఇందుకు సత్యకుమార్ కారణమని ఆ పరిసర వాసులు చెప్పుకునే వారు.
ఆగిన నిశ్చితార్థం..
ఈ నేపథ్యంలో హేమలతకు బుధవారం తిరుచ్చికి చెందని ఓ యువకుడితో వివాహ నిశ్చితార్ధానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి హఠాత్తుగా ఇంట్లోకి వెళ్లిన సత్యకుమార్ తన చేతిలోని వేట కత్తితో శివసుబ్రమణ్యంను నరికాడు. అడ్డొచ్చిన అతని సోదరుడు వైరవేల్‌ను సైతం కత్తితో దాడి చేశాడు. వీరి కేకలు విని హేమలత బయటకు పరుగెత్తికు వచ్చింది. ఆ ప్రేమోన్మాది కత్తితో హేమలత గొంతు మీద నరికాడు. ఈ సంఘటన నుంచి తేరుకున్న ఇతర కుటుంబీకులు సత్యకుమార్‌ను అడ్డుకునే యత్నం చేయడంతో ఉడాయించాడు.
గొంతు తెగడంతో హేమలతను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న సమయపురం సీఐ జ్ఞానవేల్, టోల్ గేట్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందతుడు సత్యకుమార్ కోసం గాలింపు చేపట్టారు. విచారణలో సత్యకుమార్ వన్‌సైడ్ లవ్, ప్రేమోన్మాదంతో సాగించిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది.
ప్రేమోన్మాదిగా మారాడు..
ఒక్కరోజు సత్యకుమార్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తాను ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకుంటానని హేమలత దృష్టికి తెచ్చాడు. తనకు అన్నయ్య అన్న విషయాన్ని మరచినట్టున్నావని అతడ్ని ఆమె మందలించింది. ఇంట్లో చెబితే పరువు పోతుందని భావించి అతడికి దూరంగా ఉండడం మొదలెట్టింది. అయితే, రోజు రోజుకు సత్యకుమార్ వేధింపులు పెరగడంతో కొన్ని నెలల క్రితం ఆ విషయాన్ని తండ్రికి చెప్పింది. దీతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
హేమలతకు సత్యకుమార్ నుంచి వేధింపులు పెరగడంతో ఆమెకు వివాహ ఏర్పాట్లు చేశారు. బుధవారం నిశ్చితార్ధానికి ఏర్పాట్లు జరిగాయి. విషయం తెలుసుకున్న సత్యకుమార్ ఉన్మాదిగా మారాడు. మంగళవారం రాత్రి సత్యకుమార్ ఆగ్రహాంతో హేమలత కుటుంబాన్నే మట్టుబెట్టే యత్నం చేశాడు. అంతేకాక ఆమె గొంతు నరికి పారిపోయినట్లు విచారణలో వెలుగు చూసింది. అజ్ఞాతంలో ఉన్న సత్యకుమార్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
Comments
Please login to add a commentAdd a comment