తుప్పల్లోకి దూసుకుపోయిన ట్రాక్టర్
శ్రీకాకుళం , రేగిడి: తల్లిదండ్రులు కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమారులను చక్కగా చదివించుకున్నారు. అయితే... వారికి ఉద్యోగాలు వస్తే భవిష్యత్ బాగుంటుందని కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం కోసం నానా ప్రయత్నాలు చేసినా.. ఎక్కడా ఆసరా దొరకక పోవడంతో తన స్వశక్తితో బతకాలని ఆలోచనతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసుకున్నాడు ఆ యువకుడు. సరదాగా జీవితం సాగిపోతున్న తరుణంలో ఆ ట్రాక్టరే అతని పాలిట మృత్యువైంది. వివరాల్లోకి వెళ్తే... రేగిడి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన కుదిగాన శివ(21) ఉంగరాడమెట్ట వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద సోమవారం తన ట్రాక్టర్‌కు ఆయిల్ నింపుకొని, తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. బంక్ దాటిన కొద్ది దూరంలోనే రహదారి పక్కన ఉన్న పెద్ద గోతిలో ట్రాక్టర్ చక్రాలు దిగడంతో ఖాళీగా ఉన్న ట్రక్కు కాస్త అదుపు తప్పి, అందులోకి దూసుకుపోయింది. ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న శివ రోడ్డుపైకి ఎగిరి పడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పాలకొండ సీఐ జి.శ్రీనివాస్, ఎస్‌ఐ కె.వెంకటేష్ హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకొని, బాధితుడిని 108 ద్వారా రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్పటికే అతను మృతి చెందడంతో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కె.వెంకటేష్ తెలిపారు.
జాబిస్తే ఘోరం జరిగేది కాదు!
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దాహం కోసం ఎన్నికల్లో లేనిపోని హామీలను ఇచ్చి ప్రజలను వంచించారు. తాను అధికారంలోకి వస్తే చదువుకున్న ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ యువతకు ఒక్కజాబు కూడా ఇవ్వలేదు. ఇందులో భాగంగానే రెడ్డిపేటకు చెందిన కుదిగాన శివ డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. జాబ్ వస్తుందని వేయికళ్లతో ఎదురుచూశాడు. తీరా ఇప్పటికీ జాబు రాలేదు సరికదా.. నిరుద్యోగ భృతి కూడా అందని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో నిరాశ చెంది స్వశక్తితో ఆరు మాసాల క్రితం కొనుగోలు చేసుకున్న ట్రాక్టర్‌ను నడుపుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అయితే... కుటుంబం అంతా సంతోషంగా ఉన్న సమయంలో కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కుదిగాన గౌరీశ్వరి, శ్రీనివాసరావు బోరున విలపిస్తున్నారు. శివ అందరి దగ్గర ఎంతో కలివిడిగా తిరుగుతుండే వాడని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment