పన్నులు వసూలు చేయాలి
-
గుంటూరు ప్రాంతీయ సంచాలకులు సి.అనూరాధ
కావలిఅర్బన్ : మున్సిపల్ పరిధిలోని పన్నులను 100 శాతం వసూలు చేయాలని గుంటూరు ప్రాంతీయ సంచాలకులు సి.అనురాధ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కావలి పట్టణంలోని 4, 5, 33, 34వ వార్డులతో పాటు పట్టణ ప్రధాన వీధుల్లో పారిశుద్ధ్యాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె 14, 13వ ఆర్థిక సంఘం, ఎస్సీ సబ్‌ప్లాన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ నిధుల ద్వారా చేపట్టబడిన పనులను ఇంజనీరింగ్ శాఖ ద్వారా తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డులో పొందుపరిచి ఎప్పటికప్పుడు సరిచూసి చర్యలు చేపట్టాన్నారు. పనులకు సంబంధించిన చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలన్నారు. పన్నుల వసూళ్లపై రెవెన్యూ విభాగాన్ని సమీక్షించి అన్ని రకాల పన్నులను ఏడాదిలోగా వసూలు చేయాలన్నారు. జనన, మరణ నివేదికలు, ఆస్తి పన్ను పేరు మార్పు బదిలీ, కొళాయిల మంజూరు వంటి లావాదేవీలు ఆన్‌లైన్ ద్వారానే జరపాలన్నారు. కంప్యూటర్ ఆపరేటింగ్ రాని గుమస్తాలు వెంటనే నేర్చుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.వెంకటేశ్వర్లు, డీఈ మదర్ అలీ, మేనేజర్ సత్యనారాయణ పాల్గొన్నారు.