ఆర్టీసీకి రోజుకు రూ. 20 లక్షల నష్టం
ఆర్టీసీకి రోజుకు రూ. 20 లక్షల నష్టం
Published Mon, Nov 14 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
24వ తేదీ వరకు బస్సుల్లో పెద్దనోట్లకు అనుమతి
కోవెలకుంట్ల: రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపై తీవ్రంగా పడిందని ఆర్టీసీ కర్నూలు రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం రాత్రి స్థానిక ఆర్టీసీ డిపోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో రీజియన్‌లోని ఆయా డిపోల నుంచి రోజుకు రూ. 90 లక్షల నుంచి రూ. 95 లక్షల ఆదాయం వచ్చేదని, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో రోజుకు రూ. 20 లక్షల ఆదాయం తగ్గిందన్నారు. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో ఎక్కువశాతం మంది ప్రయాణీకులు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటి కారణాలతో నష్టాలు సం¿¶ విస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కర్నూలు రీజియన్ అక్టోబర్ నెలాఖరు వరకు రూ. 51 కోట్ల నష్టాలో ఉందని, పెద్దనోట్ల రద్దు ప్రభావం కారణంగా ఆ నష్టం మరింత పెరిగే అస్కారం ఉందన్నారు. జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆత్మకూరు డిపోల్లో ఎక్కువ నష్టాలు ఉన్నాయన్నారు. వివిధ బ్యాంకుల నుంచి రూ. 20, రూ. 20, రూ. 100 నోట్లు తెప్పించి ప్రయాణీకుల కష్టాలు తీర్చుతున్నామని వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో ఈ నెల 24వ తేదీ వరకు రూ. 500, రూ. 1000 నోట్లను అనుమతిస్తామని ప్రయాణీకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, తహశీల్దార్ రామచంద్రారెడ్డి, ఎస్‌ఐ మంజునాథ్ పాల్గొన్నారు.
Advertisement