357 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
దేవరకొండ : ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఎన్ని యాక్టులు వచ్చినా.. క్రిమినల్ కేసులు నమోదవుతున్నా.. వ్యాపారులు బెదరడం లేదు. కేసులను కూడా లెక్క చేయని బియ్యం వ్యాపారులు ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు..దేవరకొండ డివిజన్‌లో కొన్నేళ్లుగా బియ్యం అక్రమ రవాణా వ్యాపారం మూడు క్వింటాళ్లు.. ఆరు టన్నులు అన్న చందంగా సాగుతోంది. వ్యాపారులు డీలర్లు, గ్రామాల్లో చిరు వ్యాపారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు సరఫరా చేస్తూ లక్షల్లో దండుకుంటున్నారు.
పక్కదారి పడుతోంది.. ఇలా..
వ్యాపారులు నిత్యం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల డీలర్ల నుంచి, కిరాణ షాపుల నుంచి, వినియోగదారుల నుంచి 10 కేజీల నుంచి మొదలు పెట్టి 100 కేజీల వరకు సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని దేవరకొండలోని తమ ఇళ్లల్లో నిల్వ ఉంచుతున్నారు. అనంతరం రాత్రికిరాత్రి డీసీఎంల్లో కల్వకుర్తి, హైదరాబాద్, మాల్ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాల్లో కేజీకి రూ.5 నుంచి రూ.10 వరకు కొనుగోలు చేసి తాము మాత్రం మిల్లు యాజమాన్యాలకు రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా దేవరకొండలో ఉన్న వ్యాపారులు నెలలో ఒక్కొక్కరు 4 నుంచి 6లోడ్‌ల వరకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
నేరుగా గోదాము నుంచే..
గతంలో దేవరకొండలో పీడీఎస్ బియ్యం పలుమార్లు సివిల్ సప్‌లై అధికారులు పట్టుకున్నప్పటికీ అవి కేవలం చిన్న మొత్తంలో మాత్రమే ఉన్నాయి. కానీ ఈ సారి అధికారులు నిఘా వేసి నేరుగా గోదాం నుంచి తరలిస్తుండగా మాటు వేసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ సారి అధికారులు 357 బస్తాలను దేవరకొండకు సమీపంలోని బ్రిడ్జి తండాలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచగా పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. అయితే తరలించిన బియ్యం మాత్రం రేషన్ షాపుల నుంచి కాకుండా నేరుగా దేవరకొండలోని స్టాక్ పాయింట్ నుంచే తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేవరకొండలోని డిండి రోడ్డులో అడ్డా ఏర్పాటు చేసుకున్న ఓ వ్యాపారి డీలర్ల నుంచి తక్కువ మొత్తానికి బియ్యాన్ని కొనుగోలు చేశాడు. ఆ బియ్యం బస్తాలను మార్చేందుకు వీలుగా దేవరకొండ సమీపంలోని ఓ తండాలో నిల్వ ఉంచాడు. సదరు సివిల్ సప్లై ముద్రలున్న బస్తాల నుంచి గోనే బస్తాల్లోకి మార్చేందుకు ఖాళీ బస్తాలను డీసీఎంలో తరలిస్తుండగా అనుమానం వచ్చి రెక్కీ నిర్వహించి ఈ బియ్యాన్ని పట్టుకున్నారు.
గత ఏడాదిలో
ఆరు నెలల క్రితం మాల్‌లో 16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
ఆర్టీసీ బస్సులో లోయపల్లి నుంచి మాల్‌కు అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.
ఏడాది క్రితం చింతపల్లి మండలం మధనాపురంలో పీడీఎస్ బియ్యం పట్టుకున్న అధికారులు.
చందంపేట మండలం బుగ్గతండాలోని ఓ ఇంట్లో 16 క్వింటాళ్లు..
ఇదే మండలంలోని కొత్తపల్లిలోని ఓ మిల్లులో 16 క్వింటాళ్లు..
దేవరకొండ మండలం ముదిగొండలో ఆరు నెలల క్రితం 15 క్వింటాళ్ల బియాన్ని అధికారులు సీజ్ చేశారు.