
: మాట్లాడుతున్న డీఐఓ వెంకటేశ్వరరావు
జిల్లాలో 365 డెంగీ పాజిటివ్ కేసులను గుర్తించినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ బి.వెంకటేశ్వరరావు వివరించారు. గురువారం కల్లూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
- డీఐఓ డాక్టర్ వెంకటేశ్వరరావు
కల్లూరు: జిల్లాలో 365 డెంగీ పాజిటివ్ కేసులను గుర్తించినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ బి.వెంకటేశ్వరరావు వివరించారు. గురువారం కల్లూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది కంటే ఈసారి డెంగీ జ్వర పీడితుల సంఖ్య పెరిగిందని, ఖమ్మం అర్బన్, రూరల్ మండలాలతో పాటు, తల్లాడ మండలంలోని మల్లవరం, గోపాలపేట, మల్సూరు తండా, కొణిజర్ల మండలంలోని సింగరాయపాలెం, బోనకల్ మండలంలోని ఆళ్లపాడు, గోవిందాపురం, రామాపురం తదితర గ్రామాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు. టైగర్ దోమ కాటు వల్ల డెంగీ జ్వరం వస్తుందని, ఇవి మంచినీళ్లల్లో పెరుగుతాయని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఖాళీ కొబ్బరి బోండాలు, టైర్లు, కూలర్లలో నీటిని గుర్తించకుంటే..ఈ దోమలు అక్కడ పెరుగుతాయని, వాటర్ ట్యాంక్‌లపై మూతలు వేయాలని తెలిపారు. ఈ దోమలు పగలు కుడతాయని, దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రైడే-ఫ్రైడే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత లేదని చెప్పారు. కల్లూరు మండలం చెన్నూరు, నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుకు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాల్సి ఉందని, బడ్జెట్ కేటాయింపు జరగాల్సి ఉందని వివరించారు. సమావేశంలో ఎస్‌హెచ్‌పీఓ డాక్టర్ ఎల్. భాస్కర్, వైద్యాధికారి పద్మజ, హెచ్‌ఈఓ వెంకటనారాయణ పాల్గొన్నారు.