ఆర్మీ ర్యాలీకి 3694 మంది హాజరు
Published Mon, Oct 10 2016 11:11 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM
బోట్‌క్లబ్ (కాకినాడ) : జిల్లా క్రీడా మైదానంలో ఆరో రోజు సోమవారం నిర్వహించిన ఆర్మీ ర్యాలీకి వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థులకు సరైన వసతులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రతీ రోజు సుమారు నాలుగు వేల మంది అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆరు జిల్లాలు నుంచి తరలివస్తున్నారు. అభ్యర్థులు సేదదీరేందుకు, సరిపడా మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు కేవలం నాలుగు మరుగుదొడ్లు మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో మరుగుదొడ్ల వద్ద యువకులు క్యూ కట్టాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితిలో అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు. ట్రేడ్‌మన్ సెలక్షన్లకు 5052 మందికి అడ్మిట్ కార్డులు జారీ చేయగా 3694 మంది హాజరయ్యారని, వీరిలో సరిపడా ఎత్తు లేకపోవడంతో 791 మందిని తొలగించారని సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 2903 మందిలో 194 మంది పరుగు పరీక్షలో పాస్ కాగా, వీరిలో 186 మంది వైద్య పరీక్షలకు ఎంపికయ్యారన్నారు. మంగళవారం ఆర్మీ టెక్నికల్ కేటగిరీలో సెలక్షన్‌లు నిర్వహిస్తారని తెలిపారు. సుమారు 4 వేల మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు.
Advertisement