8 రోజులుగా రాకపోకల్లేవు
Published Thu, Aug 8 2013 3:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
సాక్షి, తిరుపతి : ప్రయాణికులతో కిటకిటలాడే తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ఎనిమిది రోజులుగా నిర్మానుష్యంగా మారింది. చూసినంత దూరం ప్లాట్‌ఫారాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక్క తిరుపతి ఆర్‌టీసీ బస్టాండే కాదు. చిత్తూరు రీజియన్‌లోని 14 ఆర్టీసీ బస్‌డిపోల పరిధిలోని 18 బస్టాండ్లలోనూ ఇదే వరస. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సహకరించి విధులకు గైర్హాజరు అవుతుండటంతో సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది. ఎనిమిది రోజులుగా జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీనికి తోడు జిల్లాలో రహదారుల దగ్బంధం కొనసాగుతోంది. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందం గా రోడ్లపైకి వచ్చి వాహనాలు ఆపేస్తున్నారు. దీంతో ఆర్‌టీసీ యాజమాన్యం కూడా బస్సులను డిపోలకే పరిమితం చేసింది. చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, సత్యవేడు, పుంగనూరు, పల మనేరు వంటి పట్టణాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కేవలం ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయించి ప్రజలు గమ్యస్థానాలకు వెళ్తున్నారు. తమిళనాడు, కర్ణాటక బస్సు సర్వీసులను కూడా ఆయా రాష్ట్ర సంస్థలు నిలిపేశాయి.
రీజియన్‌కు రూ.11 కోట్ల నష్టం
ఆర్టీసీ చిత్తూరు రీజియన్‌కు ఇప్పటి వరకు రోజుకు రూ.1.25 లక్షల చొప్పున ఎనిమిది రోజులకు రూ.11 కోట్ల వరకు నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 14 డిపోల్లో 1450 దూర ప్రాంత బస్సులు రోడ్డెక్కకపోవటంతో ఈ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మాత్రం ఉద్యమకారులు మినహాయింపు ఇవ్వటంతో 450 బ స్సుల వరకు తిరుగుతున్నాయి. జిల్లాలో మారుమూ ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఒకటి అర గ్రామీణ స ర్వీసులు, దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసు లు, హైటెక్, వోల్వో సర్వీసులు కదలడం లేదు. ఇప్ప టి వరకు అలిపిరి డిపో పరిధిలో ఒక బస్సు స్వల్పం గా దగ్ధం కాగా, సత్యవేడు డిపో పరిధిలో రెండు బస్సులు ధ్వంసమయ్యాయి. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు రైళ్లలో వెళ్తున్నారు. దీంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి.
ప్రైవేట్ వాహనాల నిలువుదోపిడీ
ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనాలకు వరంగా మారింది. సామాన్య ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణా లైన తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, పలమనే రు, మదనపల్లి, పుంగనూరుకు సమీప గ్రామాల నుంచి రోజువారి ఉపాధి కోసం వచ్చేవారు, చిరు వ్యాపారాలు సెవెన్‌సీటర్లను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. తిరుపతి నగరంలో సిటీ బస్సులు తిరగకపోవటంతో కొద్ది దూరానికి కూడా కనీసం రూ.50 ఇవ్వనిదే ఆటోవారు రావటం లేదు. దీంతో సామాన్యులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే సెవెన్ సీటర్లే దిక్కుగా మారాయి. హైవేల పై సెవెన్‌సీటర్లు అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుల్లచేస్తున్నాయి
Advertisement
Advertisement